ముంబయిలో రామ్ చరణ్ మిస్సింగ్.. రీజన్ ఏంటి?

ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ రిలీజైంది. ఇక్కడ థియేటర్లలో ఇలా ట్రయిలర్ రిలీజ్ చేసి, అక్కడెక్కడో ఉన్న ముంబయిలో ల్యాండ్ అయింది సినిమా యూనిట్. సినిమాలోని కీలకమైన నటీనటులంతా కలిసి తొలి ప్రెస్ మీట్ ను ముంబయిలో…

ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ రిలీజైంది. ఇక్కడ థియేటర్లలో ఇలా ట్రయిలర్ రిలీజ్ చేసి, అక్కడెక్కడో ఉన్న ముంబయిలో ల్యాండ్ అయింది సినిమా యూనిట్. సినిమాలోని కీలకమైన నటీనటులంతా కలిసి తొలి ప్రెస్ మీట్ ను ముంబయిలో ఏర్పాటుచేశారు. అయితే ఎన్టీఆర్, రాజమౌళి, అజయ్ దేవగన్, అలియా భట్ అందరూ స్టేజ్ పై కనిపించారు కానీ రామ్ చరణ్ మిస్సింగ్.

అవును.. ముంబయిలో జరిగిన ప్రెస్ మీట్ కు చరణ్ రాలేదు. దీంతో పుకార్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముంబయి ప్రెస్ మీట్ కు కావాలనే చరణ్ ను తప్పించారని, ఎన్టీఆర్ ను హైలెట్ చేశారని అనుకున్నారు చాలామంది. ఈ మేరకు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో చాలా ఊహాగానాలు చెలరేగాయి.

కానీ అసలు కారణం మాత్రం అది కాదు. ముంబయి ప్రెస్ మీట్ కు రామ్ చరణ్ ను కూడా ఆహ్వానించింది యూనిట్. స్వయంగా రాజమౌళి, రామ్ చరణ్ తో సంప్రదింపులు జరిపాడు కూడా. కానీ చరణ్ కుటుంబంలో ఓ పెళ్లి జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఉపాసన చెల్లెలు పెళ్లి అది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఆ పెళ్లి వేడుకలో చరణ్ దంపతులు చురుగ్గా పాల్గొంటున్నారు.

పెళ్లి తంతులో భాగంగా ఈరోజు కీలకమైన పూజ నిర్వహించారు. ఆ పూజలో నూతన వధూవరులతో పాటు, చరణ్-ఉపాసన కూడా కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య ముంబయి ప్రెస్ మీట్ ను వదులుకున్నాడు చరణ్.

చరణ్ ను ముంబయి తీసుకొచ్చేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించాడు రాజమౌళి. ఒకవేళ అనుకున్న టైమ్ కు పూజ కార్యక్రమాలు ముగిస్తే, ప్రత్యేక విమానంలో ముంబయి తీసుకురావడానికి కూడా ప్రయత్నించారట. కానీ ఏదీ కుదరలేదు. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ ఉంది. ఈ మీడియా సమావేశానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి హాజరుకాబోతున్నారు.