అమరావతిలోనే ఇల్లు కట్టుకోలేదు… కుప్పంలో కట్టుకుంటాడా ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత రాష్ట్రం ఏపీ. రాష్ట్ర విభజన తరువాత ఆయన ఏపీకి మొదటి సీఎం అయ్యాడు. ఏపీని అంత గొప్పగా చేస్తా, ఇంత గొప్పగా చేస్తానన్నాడు. హైదరాబాదును తలదన్నే రాజధాని…

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత రాష్ట్రం ఏపీ. రాష్ట్ర విభజన తరువాత ఆయన ఏపీకి మొదటి సీఎం అయ్యాడు. ఏపీని అంత గొప్పగా చేస్తా, ఇంత గొప్పగా చేస్తానన్నాడు. హైదరాబాదును తలదన్నే రాజధాని నిర్మిస్తానని చెప్పాడు. రాజధాని నిర్మాణం ప్రారంభించి దానికి అమరావతి అని పేరుపెట్టారు. 

ఇదంతా బాగానే ఉంది. కానీ అమరావతిలో ఆయన సొంత ఇల్లు కట్టుకోలేదు. ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉన్నాడు. హైదరాబాదులో తాను దశాబ్దాలుగా ఉన్న ఇంటిని కూలగొట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అక్కడే ఉంటూ అప్పుడప్పుడూ ఏపీకి వచ్చి పోతుంటాడు.

ఇలాంటి చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో బాబు చాలా కసిగా, కోపంగా ఉన్నాడు. కుప్పంలోనే  ఉండి టీడీపీని ప్రక్షాళన చేస్తానని చెప్పాడు. కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని చంద్రబాబు తనకు తానై అనలేదు. 

కుప్పంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఓ టీడీపీ కార్యకర్త కుప్పంలోనే ఇల్లు కట్టుకోవాలని సలహా ఇచ్చాడు. దీంతో తాను ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటానని బాబు అన్నాడు. కుప్పంలో సొంత ఇల్లు పది నెలల్లోపే నిర్మిస్తానని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు కుప్పం వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయనకు గెస్ట్ హౌజ్ ఇవ్వడంలేదని, ఆయన ఉంటే కరెంట్ కట్ చేస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అందుకే ఇల్లు కట్టుకుంటే ఈ బాధలు ఉండవంటున్నారు.

టీడీపీలో కోవర్టులు ఎక్కువయ్యారని సమీక్షా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు బాబు. పార్టీలో పని చేయకుండా.. వైసీపీకి కోవర్టులుగా పని చేస్తున్నవారిని ఏరి పారేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమికి కోవర్టులే కారణమని తెలిసిందని అన్నారు. 

అతివిశ్వాసమే కొంపముంచిందని అంచనాకు వచ్చారు. కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటానని, ఇకపై ఇక్కడే ఉండి తానేంటో చూపిస్తానని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పార్టీ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ తనను మెప్పించి పార్టీ పదవులు అనుభవించిన వారిని పక్కన పెట్టేస్తానని అన్నారు.

ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పని చేసే నాయకులకే ఇకపై ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.పార్టీ ప్రక్షాళన పేరుతో సొంత సామాజిక వర్గం నాయకులను చంద్రబాబు వదులుకుంటారా? ఆయన ఆ పని చేయగలరా? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ప్రక్షాళన చేయడం చెప్పినంత తేలిక కాదని అంటున్నారు. కుప్పం మీదనే ఆరు నెలలు దృష్టి పెడతానని బాబు అంటున్నారు. కుప్పం నుంచే ఆ పని చేస్తానని చెబుతున్నారు. ఆయన పార్టీని ప్రక్షాళన చేస్తాడా, లేదా అనేది తరువాత సంగతి. కుప్పంలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటాడా లేదా అనేది కీలక ప్రశ్న.