వివాదాలకు, సంచలనాలకు మారుపేరైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యంస్వామి మరోసారి తన స్వభావానికి తగ్గట్టే స్పందించాడు. ఈ దఫా ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దుర్ఘటనపై సందేహాలు ఉన్నాయని స్వామి తనదైన రీతిలో అనుమానాలు వ్యక్తం చేశారు.
హెలికాప్టర్‌కు సంబంధించిన వీడియోను తాను విశ్వసనీయ వర్గాల ద్వారా సరిచూశానని, అది వాస్తవానికి సిరియన్ వైమానిక దళానికి చెందినదని, సీడీఎస్ ప్రయాణిస్తున్నది కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. మొత్తం హెలికాప్టర్ కుప్పకూలడంపైన్నే సందేహాలు వస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ఈ పెను ప్రమాదంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వీడియోలో హెలికాప్టర్ పొగమంచు, మేఘాలు తదితర అడ్డంకులేవీ లేని గగనతంలో ప్రయాణిస్తూ, కాలిపోతున్నట్టు ఉందని పేర్కొన్నారు.
తమిళనాడు వంటి సురక్షిత ప్రాంతంలో ఓ సైనిక హెలికాప్టర్ పేలడం అనుమానాలకు తావిస్తోందని ఆయన మరో సందర్భంలో అన్నారు. దీనిపై ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఇదిలా వుండగా సొంత పార్టీ ఎంపీనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.