మంచులో ఆటలు ఎపుడూ మంచిగానే ఉంటాయి. ప్రకృతిలో ఓలలాడడం అంటే తన్మయత్వమే. అద్భుతమైన అనుభూతుల కోసం ఎక్కడో కొండల్లో, కోనల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో గడిపేందుకు జనాలు ఎల్లప్పుడూ భారీగా క్యూ కడతారు.
అయితే సిటీలోనే అలాంటి సుందరమైన ప్రాకృతిక శోభను తీసుకు వస్తే ఎలా ఉంటుంది. జనారణ్యంలో మంచు కొండలు ఉంటే వింతగానే ఉంటాయి కదా. అలాంటి ప్రయోగమే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోంది.
విశాఖ బీచ్ రోడ్డులో స్నో పార్క్ ని ఏర్పాటు చేయబోతున్నాట్లుగా విశాఖ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. పూర్తిగా సౌత్ కొరియా టెక్నాలజీతో ఏర్పాటు చేయబోతున్న స్నో పార్క్ విశాఖ టూరిజానికి సరికొత్త అందంగా పేర్కొన్నారు.
ఇందుకోసం రెండు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తున్నామని, ఇరవై కోట్ల రూపాయలతో స్నో పార్క్ ని అక్కడ తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. ఈ స్నో పార్క్ ప్రత్యేకత ఏంటి అంటే మంచు పర్వతాన్ని అధిరోహించేందుకు వీలుగా అందులో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక మంచుతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉల్లాసం పొందేలా తీర్చిదిద్దుతున్నారు. అదే మంచులో బాస్కెట్ బాల్ వంటి ఆటలు ఆడుకునేందుకు కూడా సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఒక హొటల్ ని ఏర్పాటు చేసి మరీ అన్ని విధాలుగా టూరిస్టులు బ్రహ్మానందాన్ని పొందేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
ప్రస్తుతం డీపీయార్ దశలో ఉందని తొందరలోనే దానిని ఆమోదించి స్నో పార్క్ ని విశాఖకే తలమానికంగా డిజైన్ చేస్తామని స్మార్ట్ సిటీ చైర్మన్ చెబుతున్నారు. ఇదే కాకుండా విశాఖలో టూరిజం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, చాలా మంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని, రానున్న కాలంలో విశాఖ టూరిస్ట్ హబ్ గా మారడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.