నటుడిగానే కాకుండా తెలుగు రచయితగా కూడా ఎంతో అభిమానగణాన్ని పొందిన గొల్లపూడి మారుతీరావు చాలా కాలంగా చెన్నైలోనే ఉంటూ వస్తున్నారు. తమిళనాట స్థిర నివాసాన్ని ఏర్పరుచుకున్న తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా ఉంటూ వచ్చారాయన. తెలుగు సినిమా చెన్నై కేంద్రంగా నడిచిన దశలో గొల్లపూడి సినీ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. ఆయన నటుడు అయ్యే సమయానికి కూడా తెలుగు సినిమా చెన్నై కేంద్రంగానే నడిచింది.
సినిమా హైదరాబాద్ బాట పట్టాకా గొల్లపూడి సినిమా అవకాశాలు కొంత వరకూ తగ్గాయి. ఔట్ డోర్ షూటింగులకు చెన్నై నుంచినే ప్రయాణం సాగించుకునే అవకాశాలు ఎలానూ ఉండేవే. ఇక తెలుగు సినీ పరిశ్రమతో గొల్లపూడి చివరిదాకా బంధాన్ని కొనసాగించారు. అలాగని చెన్నైని వదల్లేకపోయారు.
ఆయన అక్కడే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దశాబ్దాల పాటు తెలుగు సినిమా వాళ్లతో కలిసి పని చేసిన వ్యక్తి గొల్లపూడి. ఆయన మరణం పట్ల కొంతమంది నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి మరణం నుంచి అంత్యక్రియలకు మధ్య సమయం ఉన్నా… టాలీవుడ్ జనాలు ఎవరూ చెన్నై వరకూ వెళ్లకపోవడం గమనార్హం.
మెగాస్టార్ చిరంజీవి మాత్రం గొల్లపూడి పార్థివ దేహానికి నివాళి ఘటించారు. ఇక బోలెడన్ని సినిమాల్లో గొల్లపూడితో కలిసి నటించిన సుహాసిని నివాళి ఘటించిన వారిలో ఉన్నారు. ఆమె కేరాఫ్ చెన్నై, సంసారం ఒక చదరంగం సినిమాలో గొల్లపూడి, సుహాసినిలు మామా-కోడళ్ల పాత్రలను బ్రహ్మాండంగా పండించారు.