భ‌యాన్ని వీడి లోకేశ్ వ‌స్తారా?

నారా లోకేశ్ ఢిల్లీ వ‌దిలి ఎప్పుడొస్తారు? ఇప్పుడిదే అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఏపీ అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీలోనే వుంటారా? లేక స్వ‌రాష్ట్రానికి వ‌చ్చి దిశానిర్దేశం చేస్తారా? అనే…

నారా లోకేశ్ ఢిల్లీ వ‌దిలి ఎప్పుడొస్తారు? ఇప్పుడిదే అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఏపీ అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీలోనే వుంటారా? లేక స్వ‌రాష్ట్రానికి వ‌చ్చి దిశానిర్దేశం చేస్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఢిల్లీలో వున్న లోకేశ్ టీడీఎల్పీ స‌మావేశంలో జూమ్ మీటింగ్‌లో పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కావ‌డంపై టీడీఎల్పీ స‌మావేశంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. వెళ్లాల‌ని కొంద‌రు, వెళ్ల‌కూడ‌ద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలిసింది. ఎందుకంటే అసెంబ్లీ స‌మావేశ‌ల్లో త‌మ‌ను కించ‌ప‌రిచేలా అధికార పార్టీ స‌భ్యులు వ్య‌వ‌హ‌రిస్తార‌ని కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయ‌ప‌డిన‌ట్టు తెలిసింది. కాబ‌ట్టి ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌జాక్షేత్రంలోనే తేల్చుకుందామ‌ని కొంద‌రు స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు స‌మాచారం.

చివ‌రికి అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌నే నిర్ణ‌యించుకున్నారు. చంద్ర‌బాబు అరెస్ట్‌తో పాటు ఇత‌ర ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేందుకు చ‌ట్ట‌స‌భ‌ల్ని ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుత అసెంబ్లీ కాల‌ప‌రిమితి ముగింపు ద‌శ‌లో ఉండ‌డంతో ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌నే అభిప్రాయానికి వ‌చ్చారు.

దీంతో స‌మావేశాల‌కు వెళ్లేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇదిలా వుండ‌గా కీల‌క స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో లోకేశ్ రాక చ‌ర్చ‌నీయాంశ‌మైంది. లోకేశ్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చి స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తే బాగుంటుంద‌ని, తద్వారా త‌న నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌ను నిరూపించుకోవ‌చ్చ‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.