ఏకుమేకైన ఏకైక ఎమ్మెల్యే ఇక లేనట్టే…!

ఏపీలో జనసేన ఏకైక ఎమ్మెల్యే, అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఏకుమేకైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇక పార్టీలో లేనట్లే అనుకోవాలి. 'జనసేనకు భవిష్యత్తు లేదు' అని క్లియర్‌గా చెప్పిన తరువాత రాపాక పార్టీలో ఉంటాడని…

ఏపీలో జనసేన ఏకైక ఎమ్మెల్యే, అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఏకుమేకైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇక పార్టీలో లేనట్లే అనుకోవాలి. 'జనసేనకు భవిష్యత్తు లేదు' అని క్లియర్‌గా చెప్పిన తరువాత రాపాక పార్టీలో ఉంటాడని అనుకోలగలమా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓ ఎమ్మెల్యేగా తన భవిష్యత్తు తాను చూసుకోవాలని అన్నాడు.

అంటే ఈయన జనసేన పార్టీకి జై కొడుతున్నట్లే కదా. ఈ రోజుల్లో పార్టీ మారడం సర్వసాధారణమని చెప్పాడు. పార్టీ మారాలనే ఆలోచన తనకు ఇప్పటివరకు రాలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నాడు. తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి తన భవిష్యత్తు చూసుకోవాలని, జనసేనలో తనకు భవిష్యత్తు లేదని స్పష్టంగా చెప్పేశాడు. 

జనసేనలో తనకు భవిష్యత్తు లేదంటున్న ఈయన అందుకు చెప్పిన కారణం విచిత్రంగా ఉంది. అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, ఆయనకు ఆ కోరిక ఉంటేనే తనలాంటివారు పార్టీలో ఉంటారని రాపాక చెప్పాడు. 'ఇది భవిష్యత్తు లేని పార్టీలా ఉంది' అన్నాడు. సీఎం కావాలనే కోరికతో పవన్‌ కళ్యాణ్‌ ముందుకు నడవాలని సలహా ఇచ్చాడు.

కాకినాడలో పవన్‌ కళ్యాణ్‌ నిర్వహించిన రైతు సౌభాగ్య దీక్షకు రాలేనని ముందుగానే చెప్పానన్నాడు. తాను జగన్‌కు అనుకూలమని స్పష్టం చేసేశాడు. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్‌ ఇవ్వరని, అనుకూలంగా మాట్లాడితేనే ఇస్తారని అన్నాడు.అంటే అసెంబ్లీలో మాట్లాడటం కోసమే తాను ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడా? ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అందుకు వ్యతిరేకంగా మాట్లాడటం తనవల్ల కాదన్నాడు. రాపాక ముసుగులో గుద్దులాటకు స్వస్తి చెప్పి తన మార్గమేమిటో పవన్‌కు తెలియబరిచాడు.

ఎన్నికలు ముగిసినప్పటినుంచే రాపాక వైకాపా వైపు చూస్తున్నాడని అర్థమమవుతోంది. పవన్‌ ఓ పక్క జగన్‌ సర్కారుపై నిప్పులు చెరుగుతుండగా, రాపాక జగన్‌కు జేజేలు కొడుతూ ఆయన విధానాలను పూర్తిగా సమర్ధిస్తున్నాడు. బయట ఒక రకంగా మాట్లాడుతున్న ఈ ఎమ్మెల్యే అసెంబ్లీలో మరో రకంగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం పట్ల ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ పార్టీ ఒక లైన్‌ తీసుకున్నప్పుడు దాన్ని అనుసరించి పోవల్సిందే. 

పార్టీ విధానాలను వ్యతిరేకించదలచుకుంటే ఆ పని పార్టీ సమావేశాల్లో చేయాలి. అంతే తప్ప మీడియా ముందో, అసెంబ్లీలోనో చేయకూడదు. అసలు పార్టీలోనే ఉండకూడదనుకుంటే రాజీనామా చేసి పోవాలి. మరి ఈయన రిజైన్‌ చేస్తాడా? లేదా పవన్‌ కళ్యాణ్‌ పార్టీ నుంచి పీకేస్తాడా? గతంలో బడ్జెటు సమావేశాల్లో జగన్‌ భజన చేసిన రాపాక వరప్రసాద్‌, ఇప్పటి సమావేశాల్లోనూ అదే పని మరింత జోరుగా చేశాడు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని పవన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా రాపాక ఇది బ్రహ్మాండమైన విధానమంటూ జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.పవన్‌ చేపట్టిన 'మన  నది-మన నుడి' కార్యక్రమం గురించి అసెంబ్లీలో ఒక్క ముక్కా మాట్లాడలేదు. పవన్‌ రైతు సమస్యలపై ఆందోళనకు దిగితే ఎమ్మెల్యే అసలు పట్టించుకోలేదు.

ఆ కార్యక్రమానికి, సభకు తాను రాలేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. జనసేనకు పార్టీ నిర్మాణం లేదని విమర్శించిన రాపాక ఈ విషయంలో తనకు, పవన్‌కు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్పాడు. రాపాక అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ చిరునవ్వులు చిందిస్తూ కూర్చోవడం వారిద్దరి అనుబంధాన్ని స్పష్టం చేస్తోంది. ఈ అనుబంధం రాంకో సిమెంట్‌లా దృఢమైనదేమో…