ప‌గిలితే అతుక్కోదు…గాజు గ్లాస్‌కి ఓటు వేస్తే!

ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్‌కి గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు. ప‌ళ్లు వూడ‌గొట్టుకోడానికి ఏ రాయి అయినా ఒక‌టే. ఒక పెగ్గు మందు తాగ‌డానికి ఏ గ్లాస‌యినా ఒక‌టే. అయినా గాజు గ్లాస్‌లో తాగితే ఆ కిక్కే వేర‌బ్బా.…

ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్‌కి గాజుగ్లాస్ గుర్తు కేటాయించారు. ప‌ళ్లు వూడ‌గొట్టుకోడానికి ఏ రాయి అయినా ఒక‌టే. ఒక పెగ్గు మందు తాగ‌డానికి ఏ గ్లాస‌యినా ఒక‌టే. అయినా గాజు గ్లాస్‌లో తాగితే ఆ కిక్కే వేర‌బ్బా. ప‌వ‌న్ త‌న‌కి చ‌రిత్ర తెలుసు అంటాడు కానీ, నిజానికి గాజు గ్లాసు ఎలా చేస్తారో ఆయ‌న‌కి తెలియ‌దు.

ఇసుక‌, సోడియం కార్బ‌నేట్‌, సున్న‌పు రాయి క‌లిపి వేడిచేస్తే గ్లాస్ త‌యార‌వుతుంది. ఇసుక అన‌గానే ప‌వ‌న్ వైసీపీ మీద‌కి దూకుతాడు. ప‌వ‌న్ ల‌క్ ఏమంటే గ్లాస్ గుర్తుని జ‌నంలోకి సుల‌భంగా తీసుకెళ్లొచ్చు. అయినా ఓడిపోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ల‌క్ష గాజు గ్లాసుల్ని ప్ర‌జ‌ల‌కి పంచ‌వ‌చ్చు. అదే కుట్టు మిష‌న్‌, కెమెరా గుర్తులిస్తే అంతే సంగ‌తులు.

తెల్లారి లేస్తే టీ షాపుల్లో క‌న‌ప‌డేది గాజు గ్లాసులే. వేడివేడి టీ సిప్ చేస్తూ వుంటే మ‌జానే వేరు. టీ షాపులు మినీ అసెంబ్లీల‌తో స‌మానం. అన్ని ర‌కాల రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రుగుతూ వుంటాయి. పాలు, చ‌క్కెర‌, డికాక్ష‌న్ క‌లిసిపోయిన‌ట్టు అన్ని పార్టీల ప్ర‌ణాళిక‌లు మిక్స‌యి ఏదో ఒక తీర్పు వెలువ‌డుతూ వుంటుంది.

ఈ మ‌ధ్య ఒక గ్లాసర్‌ని (టీ తాగువాడు) ప‌వ‌న్ గురించి అడిగితే ఉరుములు ఎక్కువ‌, వాన త‌క్కువ అన్నాడు. చేతిలో జ‌న‌సేన గుర్తు పెట్టుకుని ఈ విధంగా మాట్లాడ్డం క‌రెక్టా అంటే, టీ అంటే టైమ్‌పాస్‌. ఆ పార్టీ కూడా అంతే అన్నాడు. గాజు గ్లాసు క‌డుపు నింప‌ద‌ని అత‌ని అంత‌రార్థం.

ఈ సారి తానొక ఉప్పెన అని ప‌వ‌న్ భావ‌న‌. సినిమాలో వాన రావాలంటే రెయిన్ ఎఫెక్ట్ వేరే వుంటుంది. మ‌న‌కి నిజ‌మైన వాన‌లా క‌నిపిస్తుంది కానీ, నిజం కాదు. ప‌వ‌న్ కూడా గ్రాఫిక్స్ చూసి ఫిక్స్ అయిపోతున్నాడు. ఉప్పెన‌, సునామి అనే భ్ర‌మ‌ల్లో వున్నాడు. స‌ముద్ర‌మే లేదు, సునామి ఎలా సాధ్యం?

జైల్లో వున్న బాబుని చూసి బోరున ఏడ్చిన ప‌వ‌న్‌, గ్లాస్ , సైకిల్ క‌లిసి ప్ర‌యాణిస్తాయ‌ని హామీ ఇచ్చాడు. సైకిల్ నుంచి ప‌డితే గ్లాస్ ప‌గిలిపోతుంది. తాంబూలాలు ఇచ్చినంత ఈజీ కాదు, పెళ్లి జ‌రిపించ‌డం. ఈ రోజు వ‌ర‌కు గుర్తు వ‌స్తుందో లేదో గ్యారెంటీ లేని ప‌వ‌న్, రేపు ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పుతాడ‌ట‌! గెలిచిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి ఎవ‌రో తేలుతుంద‌ట‌.

హృద‌యం గాజు గ్లాసు వంటిది – ఇది పాత సినిమా డైలాగ్‌. ప‌గిలితే అతుక్కోదు. గ్లాస్‌కి ఓటు వేసినా అంతే, మురిగిపోతుంది. ఇది జ‌నానికి బాగా తెలుసు.