దేశం మొత్తం ఇప్పుడు జగన్మోహనరెడ్డి వైపు చూడాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలు కూడా.. అనుసరించడానికి తగిన, మంచి చట్టాన్ని జగన్ తీసుకువచ్చారు. దిశ ఘటన నేపథ్యంలో.. అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడాలంటేనే ఎవ్వరైనా సరే జడుసుకోవాల్సిన విధంగా దిశ చట్టాన్ని ఏపీ సర్కారు రూపొందించింది. ఎలాంటి నేరానికి పాల్పడినా పర్లేదు.. కేసు ఒకసారి కోర్టుకు వెళ్లిందంటే.. ఇక సంవత్సరాలతరబడి నిశ్చింతగా గడిపేయవచ్చు.. అనే ధీమా నేరగాళ్లలో ప్రబలకుండా.. 21 రోజుల్లో శిక్షను కూడా తేల్చేసే అత్యద్భుతమైన చట్టాన్ని జగన్ తీసుకువచ్చారు. ఈ బిల్లుకు ఏపీ శాసనసభలో ఆమోదం లభించింది.
దిశ బిల్లును జగన్మోహనరెడ్డి ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం కింద.. ఆడవాళ్లమీద నేరాలకు పాల్పడిన వారిపై ఏడు రోజుల్లోగా విచారణ పూర్తిచేయాలి. 14 రోజుల్లోగా వారి శిక్షను తేల్చాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర న్యాయం లభిస్తుందనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం డిమాండ్ చేయడం జరుగుతోంది. అయితే సూపర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, డిమాండును బట్టి కాకుండా.. ఆటోమేటిగ్గా వర్తించేలా జగన్ సర్కారు ఈ చట్టాన్ని తెచ్చింది.
అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడేప్పుడు.. నిందితుల్లో పశుప్రవృత్తి బయటపడుతోంది. దొరికినా.. కేసులు తేలేలోగా జీవితాలు గడిచిపోతాయనే దురభిప్రాయం వారిని మరింత రెచ్చగొడుతోంది. అలాంటి వాళ్లకు భయం పుట్టించేలా ఈ బిల్లు రూపొందింది. 21 రోజుల్లోగా మొత్తం శిక్ష ఏమిటో తేలిపోయేలాగా దీనిని రూపొందించారు. పదేళ్లనుంచి యావజ్జీవం వరకు జైలుశిక్ష, మరణశిక్షలను కూడా అమలు చేసేలా.. దీనిని రూపొందించారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు అంటున్నారు.. కానీ కేసులు తేలడం లేదు అంటూ ఈ సందర్భంగా జగన్ అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రమైనా సరే.. అమ్మాయిలపై నేరాలను అరికట్టడానికి ఇలాంటి చట్టం తీసుకురావాలని అనిపించేలా.. మోడల్ చట్టంగా ఉండేలా దీనిని రూపొందించారు. అన్ని రాష్ట్రాలపాలకులూ ఈ విషయంలో జగన్ వైపు చూసే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని అనుసరిస్తూ గానీ, మరింత మెరుగులు పెడుతూ గానీ.. తమ తమ రాష్ట్రాల్లో కొత్త చట్టాలు తెస్తే.. నేరాలు మరింత తగ్గుతాయి.