అడుగుపెట్టకముందే ముసలం పుట్టించిన కన్నా!

గుంటూరు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టబోతోందా. కన్నా లక్ష్మీనారాయణ రూపంలో.. గుంటూరు జిల్లాలో తెలుగు దేశాన్ని నెత్తిన పెట్టుకునే కమ్మసామాజిక వర్గాన్ని నిలువునా రెండు ముక్కలుగా చీల్చబోతున్నదా? అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. …

గుంటూరు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టబోతోందా. కన్నా లక్ష్మీనారాయణ రూపంలో.. గుంటూరు జిల్లాలో తెలుగు దేశాన్ని నెత్తిన పెట్టుకునే కమ్మసామాజిక వర్గాన్ని నిలువునా రెండు ముక్కలుగా చీల్చబోతున్నదా? అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.  ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా సారథ్యం వహించిన భారతీయ జనతా పార్టీకి, భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలో ఉండగలదు అని భావిస్తున్న బలమైన పార్టీకి రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన భవిష్యత్ ప్రస్థానం గురించి ఇప్పటిదాకా ఇంకా లీకులు ఇవ్వలేదు.

అయితే, కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో అడుగుపెడితే మాత్రం ఆ పార్టీలో ముసలం పుట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ ముసలం కూడా కమ్మ సామాజిక వర్గంలోనే పుట్టబోతోంది. కన్నా లక్ష్మీనారాయణ తో కొన్ని దశాబ్దాల శత్రుత్వాన్ని కలిగి ఉన్న రాయపాటి సాంబశివరావు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కన్నాను తెలుగుదేశంలో  చేర్చుకోవడానికి వీల్లేదని అంటున్నారు. అసలు ఆయన బలమైన నాయకుడే కాదని వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి రాయపాటి సాంబశివరావు రాజకీయంగా ఇప్పుడు పెద్ద యాక్టివ్ గా లేరు. వార్ధక్యం పైబడి పూర్తిగా ఇంటికే పరిమితమై ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు.. అయినా సరే తన చిరకాల ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లోకి చేరుతారనే పుకార్లను కూడా ఆయన సహించలేకపోతున్నారు.

నిజానికి రాయపాటి సాంబశివరావు పుట్టుతో తెలుగుదేశం నాయకుడు కాదు. కన్నాతో కలిసి కాంగ్రెసులో వెలగబెట్టిన వారే.  అయినా ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి.  కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న కోర్టు కేసులో ఇటీవల రాజీ కుదిరింది. టెక్నికల్గా కేసులో రాజీ కుదిరిందే తప్ప రాయపాటిలో శత్రుభావన మాత్రం తగ్గలేదు.

నిజానికి కన్నా లక్ష్మీనారాయణకు జనసేన నుంచి కూడా ఆహ్వానం ఉంది. అయితే ఆయన అనేక సమీకరణాలను లెక్క వేసుకుని తెలుగుదేశంలో చేరాలనుకుంటున్నట్టు సమాచారం.  అడుగు పెట్టడానికి ముందే ఆ పార్టీలో ముసలం పుడుతోంది. రాయపాటి స్పష్టంగా బయటపడ్డారు కానీ.. బయటకు వ్యక్తం చేయకుండా కన్నా రాకను వ్యతిరేకిస్తున్న కమ్మ నాయకులు ఇంకా చాలామంది ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఈ నేపథ్యంలో, కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించడం కూడా చర్చనీయాంశం అవుతుంది. సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో అక్కడ కోడెల శివప్రసాద్ పోటీ చేశారు. కోడెల కుమారుడు శివరాం తనకు టికెట్ గ్యారెంటీ అనుకుంటున్నారు. కోడెల శివరాం కు టికెట్ ఇవ్వడం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అవుతుందనే ప్రచారం కూడా ఉంది. 

చంద్రబాబు నాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గాన్ని కన్నా చేతిలో పెడితే, మరి కోడెల కుటుంబానికి ఎలా న్యాయం చేస్తారు. నరసరావుపేటకు తీసుకువెళ్తే అక్కడి ఆశావహులను ఎలా బుజ్జగిస్తారు? ఇవన్నీ ప్రశ్నలే. కన్నా తెలుగుదేశం లో చేరడం జరిగితే కనుక, ఆ పార్టీలో పుట్టబోయే ముసలం చాలా సమీకరణాలను మార్చేలా కనిపిస్తుంది.