టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోరుకున్నట్టుగానే జగన్ సర్కార్ నడుచుకుంటోంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రభుత్వం వింతగా ప్రవర్తిస్తోందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగిస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిపై ప్రజల్లో సానుభూతి కలిగించడంలో ఏపీ సర్కార్ విజయవంతమైన పాత్ర పోషిస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి వెళ్లాలని రాజకీయ పార్టీల నేతలు అనుకుంటారు. అదే ఆలోచన చంద్రబాబు కూడా చేశారు. ఇందులో భాగంగా ఆయన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన కార్యక్రమాలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు.
మూడో రోజు వచ్చే సరికి ప్రభుత్వానికి ఎవరేం చెప్పారో కానీ, చెడ్డపేరు తెచ్చే పనికి ఒడిగట్టారు. అనపర్తి సభకు ముందు ఇచ్చిన అనుమతిని రద్దు చేసినట్టు ప్రకటించారు. మరోవైపు ముందస్తు షెడ్యూల్ ప్రకారం అనపర్తికి చంద్రబాబు బయల్దేరారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు రోడ్డుపై కూచొని చంద్రబాబును ముందుకు వెళ్లనివ్వకూడదని పట్టుదలతో వ్యవహరించడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించాయి.
రెండురోజుల పాటు చంద్రబాబు సభలు, రోడ్‌షోల్లో పాల్గొని తాను చెప్పదలచుకున్నదేదో మాట్లాడారు. ఎప్పుడైతే పోలీసులు ఓవరాక్షన్ చేశారో, అప్పుడు చంద్రబాబు పర్యటన రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించింది. పోలీసులు అడ్డుకోవడంతో మహాత్మాగాంధీ దండి మార్చ్ స్ఫూర్తితో అంటూ అనపర్తి మార్చ్‌కు బాబు దిగారు. ఆరేడు కిలోమీటర్లు చొప్పున చంద్రబాబు నడక సాగించి, సభను విజయవంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాధించిందేంటి? అనే ప్రశ్నకు… నిరంకుశంగా వ్యవహరి స్తోందన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
మున్ముందు పోలీసులు అడ్డుకున్నా… అనపర్తి స్ఫూర్తితో దేన్నీ లెక్క చేయని తెగింపు టీడీపీ శ్రేణుల్లో వస్తుంది. ఏపీ సర్కార్ అణచివేత చర్యలతో టీడీపీ శ్రేణుల్ని, నేతల్ని మరింత రాటుదేలుస్తోంది. ఎన్నికల నాటికి వారిలో తాడోపేడో తేల్చుకోవాలన్న కసి, పట్టుదల ప్రభుత్వమే పెంచుతోంది. జీవో-1 పేరుతో ప్రతిపక్షాలకో రూల్, తమకైతే మరోలా వ్యవహరిస్తుండడమే అన్ని సమస్యలకు కారణమైంది.
ప్రభుత్వ తాజా చర్యలకు చంద్రబాబుకు రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నాయి. బాబు కోరుకున్నది కూడా ఇదే. అయినా జగన్ ప్రభుత్వానికి మంచీచెడ్డల గురించి చెప్పేదెవరు? చెప్పినా వినేదెవరు?