సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా ఏడాది కాలం ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ పక్షాలన్నీ అప్రమత్తం అయ్యాయి. సమయాన్ని వృథా చేసుకోకూడదనే తలంపులో ప్రధాన రాజకీయ పక్షాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే… జనసేన పార్టీది ఓ విచిత్ర పరిస్థితి. అసలు రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నదా? లేదా? అనేది భేతాళుడి ప్రశ్నగా తయారైంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే ఉద్దేశంతో వైఎస్ జగన్, చంద్రబాబు, లోకేశ్ తమదైన రీతిలో జనంలోకి వెళుతున్నారు.
అదేంటో గానీ, పవన్‌కల్యాణ్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. అంతకు ముందు కనీసం వీకెండ్స్‌లో ఇలా వచ్చి, అలా మెరుపు తీగలా వెళ్లిపోయేవారాయన. ఇటీవల కాలంలో అదీ లేదు. ఎంతసేపూ పత్రికా ప్రకటనలు, ట్వీట్లకు పరిమితం అయ్యారనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. వారాహితో జనంలోకి వస్తున్నా, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఆ మధ్య ప్రగల్భాలు పలికారు. అయ్యా , నిన్ను అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు.
తాజాగా చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు ఎదురు కావడంతో పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియజేస్తోందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోపెట్టడం ఏంటి? ప్రజలు తమ నిరసన తెలియజేయడానికి రోడ్డుపై బైఠాయించడం చూస్తాం గానీ, విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదని విమర్శించారు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదని విరుచుకుపడ్డారు. 72 ఏళ్లకు పైబడిన వయసులో వైసీపీని ఎదుర్కోడానికి చంద్రబాబు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి పవన్ ఏం చేస్తున్నట్టు? వైసీపీ ప్రభుత్వం అలా, ఇలా అంటూ విమర్శలతో పవన్ ఇంకెంత కాలం పొద్దు గడుపుతారనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
చంద్రబాబు మాదిరిగా జనంలోకి వచ్చేందుకు పవన్‌కు ఇంకా మంచి ముహూర్తం దొరకలేదా? ఏంటీ కామెడీ విమర్శలనే వాళ్లు లేకపోలేదు. రాజ్యాంగ విలువలు తెలియని, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని వైసీపీ ప్రభుత్వంపై పోరాడితే ప్రశంసిస్తారే తప్ప, ఇలా ఎక్కడో కూచుని పోస్టులు పెడితే ప్రయోజనం ఏంటి? జనసేన రాజకీయం ఇంతేనా? ఇంతకు మించి పవన్ ఎదగాలని అనుకోవడం లేదా? ఇలాగైతే సమాజంలో మార్పు ఎలా వస్తుంది? అనే ప్రశ్నలకు కనీసం జవాబు చెప్పడానికైనా ఆయన జనంలోకి రావాలి.