Advertisement

Advertisement


Home > Politics - Analysis

నారా వారు నేర్చుకోవాల్సిన ‘మహా’ నీతి!

నారా వారు నేర్చుకోవాల్సిన ‘మహా’ నీతి!

తాను చంద్రబాబునాయుడుకు కొడుకు గనుక.. తెలుగుదేశం పార్టీ మీద సర్వాధికారాలు తనవేనని, చంద్రబాబునాయుడు వారసుడిగా ముఖ్యమంత్రి కావాల్సిన వాడిని కూడా తానేనని నారా లోకేష్ కొన్ని ఊహల్లో బతుకుతూ ఉంటారు. తన అర్హతను ప్రశ్నించేవారు, నిలదీసేవారు, సీనియర్లు, పార్టీ పుట్టినప్పటినుంచి మూలస్తంభాలుగా ఉంటూ సేవలందిస్తున్న అనేకమంది ఉండగా.. వారితో ఇబ్బందులు రాకుండా.. పార్టీకోసం తానే ఎక్కువ కష్టపడుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఒకవేళ పార్టీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే గనుక.. అది కేవలం తన పుణ్యమే అని చెప్పుకోవడానికే ఈ పాదయాత్ర అనే చర్చ వారి పార్టీలోనే నడుస్తోంది. అయితే, చంద్రబాబునాయుడు కొడుకుగా పుట్టడం వలనే తనకు అధికారం దక్కాలని అనుకుంటున్న నారా లోకేష్, ఆయనను ముఖ్యమంత్రి సీట్లో చూడాలని తపనపడుతున్న చంద్రబాబు తదితరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం మహారాష్ట్ర రాజకీయాల్లో నిరూపణ అయింది. 

రాజకీయ వారసత్వం అనేది కేవలం ఒక పెద్ద నాయకుడి కడుపున పుట్టడం వల్ల మాత్రమే రాదు. అందుకు ఇతరత్రా చాలా లెక్కలుంటాయి.. పార్టీకోసం పనిచేసిన అనుభవం ఉంటుంది, పార్టీ నాయకులందరూ కలసికట్టుగా గుర్తించే పద్ధతి ఉంటుంది.. అని మహారాష్ట్ర శివసేన రాజకీయాలు నిరూపించాయి. 

మంచో చెడో, మహారాష్ట్రలో శివసేన పార్టీ రెండు ముక్కలుగా చీలింది. కాంగ్రెస్ తో జట్టుకట్టి ముఖ్యమంత్రిత్వం వెలగబెడుతున్న ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో పార్టీలో చీలిక వర్గం ఏర్పడింది. వారికి సహజంగానే భారతీయ జనతా పార్టీ వెన్నంటి నిలిచింది. నిజానికి చీలిక వర్గం బలం తక్కువే అయినప్పటికీ.. ఏక్‌నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చోబెట్టింది. 

అప్పటినుంచి అటు షిండే– ఇటు ఠాక్రే వర్గాలు.. పార్టీ మీద ఆధిపత్యం కోసం కొట్టుకుంటూ వచ్చాయి. తాజాగా ఈసీ అవసలు శివసేన అనేది ఏక్‌నాథ్ షిండేకే చెందుతుందని, విల్లు బాణం గుర్తు వారిదేనని తేల్చి చెప్పింది. నిరసించిన ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఈసీ తీర్పు ఎలా వచ్చినా రెండో వర్గం సుప్రీం కు వెళ్లడం అనేది సహజంగా జరుగుతుంది. 

ఈ ఎపిసోడ్ నుంచి తెలుగు రాజకీయాలు గ్రహించాల్సిన సత్యం ఉంది. కేవలం పెద్దపులి బాల్ థాకరే కొడుకును గనుక.. తనకు శివసేన మీద అధికారం రావాలని ఉద్ధవ్ అనుకున్నారు. ఆ కోరిక నెరవేరలేదు. కుటుంబ సభ్యుడు కాకపోయినా.. పార్టీలో మరొక సమర్థుడు ఉన్నప్పుడు.. పార్టీ మొత్తం అతని వెన్నంటి నిలుస్తుందని.. టెక్నికల్ గా ఎన్నికల సంఘం గుర్తింపు కూడా వారికే దక్కుతుందని శివసేన పరిణామాలు చాటిచెప్పాయి. 

దీనినుంచి లోకేష్ నీతి నేర్చుకోవాలి. చంద్రబాబు కొడుకు కావడం వలన.. తానే నెక్ట్స్ సీఎం కావాలని కలగంటే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా వైఎస్సార్ వారసుడిని అని చెప్పుకుని పార్టీ పెత్తనం కోరుకోలేదు. తండ్రి చివరి శ్వాస వరకు కొనసాగిన కాంగ్రెసు పార్టీని వదలిపెట్టి, తను సొంతంగా పార్టీ పెట్టుకుని తన రెక్కల కష్టంతో సీఎం అయ్యారు. తండ్రికి ఉన్న ప్రజాదరణ ను ఆయన వారసత్వంగా పొందారే తప్ప, తండ్రి ద్వారా అధికార వైభవాన్ని, పార్టీపై పెత్తనాన్ని పొందలేదు. ఈ నీతిని నారా లోకేష్ నేర్చుకుంటే.. ఇప్పుడు కాకపోయినా ముందు ముందు అయినా ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే.. సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా రెండు ముక్కలు అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?