సీమ‌లో నిరాశ‌ప‌రిచిన సీఎం ప‌ర్య‌ట‌న‌!

రాయ‌ల‌సీమ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న నిరాశ‌ప‌రిచింది. సీమ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌ర్నూలు జిల్లాలో హంద్రీనీవా నుంచి చెరువుల‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కాన్ని సీఎం ప్రారంభించారు. తీవ్ర నీటి సమస్య ఉన్న డోన్,…

రాయ‌ల‌సీమ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న నిరాశ‌ప‌రిచింది. సీమ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌ర్నూలు జిల్లాలో హంద్రీనీవా నుంచి చెరువుల‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేసే ప‌థ‌కాన్ని సీఎం ప్రారంభించారు. తీవ్ర నీటి సమస్య ఉన్న డోన్, పత్తికొండ ప్రాంతాలకు ఉపయోగకరమైన ఏర్పాటు చేయడం సంతోషం. అందుకు ప్రభుత్వానికి అభినందనలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  రాయలసీమ నీటి సమస్యపై చేసిన ప్రసంగంలో తాము చేయబోయే ప్రయత్నాలు విన్న తర్వాత నిరాశ‌ప‌రిచిందని చెప్పక తప్పదు.

శ్రీ‌శైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి ఉన్న పరిమితుల గురించి సీఎం సరిగ్గానే మాట్లాడారు. బ్యాక్ వాటర్ తీసుకోవడం, తెలంగాణ 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి, నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించామని తెలిపారు. కృష్ణలో వరద రోజులు తగ్గి ప్రవాహం బాగానే ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయాలంటే వరద సమయంలో అది కూడా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని వదిలేసే సమయంలో శ్రీశైలం నుంచి నీటిని గరిష్ట స్థాయిలో పోతిరెడ్డిపాడు, మాల్యాల నుంచి నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలి.

అందుకు అనుగుణంగా రోజుకు 3 TMC ల నీటిని లిఫ్ట్ చేసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. అయితే ఈ ప‌థ‌కం డిజైన్ లో మార్పులు చేయాలి. రాయలసీమ ఇంజనీర్లు మార్పులు కోరుతున్నా వినే నాథులు లేరు. అదే సమయంలో 50 TMC ల సామర్ధ్యంతో కృష్ణపై తీగల వంతెన స్థానంలో సిద్దేశ్వరం అలుగు కావాలని రాయలసీమ సమాజం ఆడుగుతున్నా అదే ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి  కనీసం స్పందించకపోవడం బాధాకరం.

ముఖ్యంగా 103 TMC ల నీటి హక్కు కలిగి గత ఏడాది 600 TMC ల నీటిని తీసుకొచ్చిన తుంగభద్రను, రాయలసీమ అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. అత్యంత కీలకమైన గుండ్రేవుల గురించి ముఖ్యమంత్రి  ప్రకటన చేస్తారని ఆశించిన‌ సీమ ప్రజలకు నిరాశే మిగిలింది. ఆచరణకు నిధులు, కాల వ్యవధికి పరిమితులు ఉండవచ్చు కానీ, ఆలోచనకు అటువైపు అడుగులు వేయడానికి పరిమితులు ఎందుకు? 

దివంగత వైఎస్సార్ పోలవరం ప్రాజెక్టు చేపట్టే సమయానికి నిధులు, అనుమతులపై అనేక పరిమితులు ఉన్నా అటు వైపు అడుగులు వేసి ఒక దారికి తెచ్చారు. దీని ఫ‌లితంగా విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మారింది. నాడు వైఎస్సార్ అటువంటి దూరదృష్టితో అడుగులు వేయకుండా ఉంటే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉండేదా? పరిమిత వనరులున్న విభజిత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించే పరిస్థితి ఉండేదా ? పోలవరం ఓ కలగానే మిగిలి ఉండేది.

వైఎస్సార్ రాజకీయ వారసుడిగా నీటి ప్రాజెక్టులపై స్పష్టమైన అవగాహ‌న కలిగిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నుంచి రాయలసీమ సమాజం సీమ నీటి సమస్య పరిష్కారానికి బలమైన అడుగులు వేయాలని ఆశించింది. 2019 ఎన్నికల‌ సమయంలో దుమ్ముగూడెం టేల్ పాండ్‌ పథకాన్ని పునరుద్ధరణ చేయాలని తిరుపతిలో నేను కోరాను. అప్పుడాయ‌న‌ విపక్ష నేత హోదాలో అన్న మాట దుమ్ముగూడెం పోలవరానికి అదనం అని, ఒక్క మాటలో చెప్పాలంటే మరో పోలవరం అని వివరించారు. అంతటి స్పష్టమైన అవగాహన కలిగిన వైఎస్ జ‌గ‌న్ నుంచి దుమ్ముగూడెం పునరుద్ధరణ, సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల విషయంలో నిర్మాణాత్మక అడుగులు పడతాయని ఆశించిన రాయలసీమ సమాజానికి ముఖ్యమంత్రి గారి కర్నూలు పర్యటనలో చేసిన ప్రసంగం నిరాశే మిగిల్చింది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం