నాకూ నా ఎమ్మెల్యేకీ దూరం పెంచుతున్నారు, అవాస్తవాలు రాస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలపై రంకెలేస్తున్నారు పవన్ కల్యాణ్. పోనీ ఆ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు ఆయన అనుంగు అనుచరుడు, పవన్ ని దేవుడంటూ పొగిడిన రాజురవితేజ చేసిన ఆరోపణలకు పవన్ ఏమని సమాధానం చెబుతారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో కూడా ప్రత్యర్థులు ఎడిటింగ్ చేశారని చెప్పగలరా, లేక ఆయనకి మతి భ్రమించిందని తనపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అనగలరా? ఇవేవీ అనలేని పవన్ కల్యాణ్ కేవలం ఆయన రాజీనామా ఆమోదించినట్టు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
రాజు రవితేజకి ఇది మామూలేనన్నట్టుగా సింపతీ చూపించారు పవన్. గతంలో కూడా ఆయన ఓ సారి ఇలాంటి బాధతోనే పార్టీ వీడారని, తిరిగి పార్టీలోకి వచ్చారని, ఈసారి కూడా అదే జరుగుతుందన్నట్టుగా ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తమ్మీద ఒక విషయం అయితే స్పష్టమవుతోంది. పవన్ కల్యాణ్ ఇటీవల దూకుడు పెంచి కులమతాలను రెచ్చగొట్టడం, జగన్ ని కావాలనే టార్గెట్ చేయడం చాలామందికి నచ్చడంలేదు.
రాజు రవితేజ కి కూడా పవన్ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నారని, ఆల్మోస్ట్ వెళ్లారనే అర్థమవుతోంది. జనసేన మొదటి ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు రాజు రవితేజ. ఆయనకి పార్టీలో సముచిత గౌరవమే దక్కింది. అలాంటి వ్యక్తే పార్టీని వీడుతున్నారంటే పవన్ పై ఆయనకున్న అభిప్రాయంలో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతోంది. దీన్ని కూడా లైట్ తీసుకుంటే పవన్ ని ఇంకెవరూ కాపాడలేరు.
వెళ్లిపోయేవాళ్లంతా స్వార్థపరులే కావొచ్చు, కానీ వారు చేసే సూచనలైనా పవన్ పాటించాలి, వాటి గురించి ఓసారి ఆలోచించాలి, కేవలం వాటిని విమర్శలుగా మాత్రమే తీసుకొని.. భజనపరుల్నే నమ్ముకుంటే జనసేన ఇంకా దిగజారి పోవడం ఖాయం. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలని, ప్రజల్లో తగ్గుతున్న గ్రాఫ్ ని.. ఇతరులపై నెట్టి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం కంటే.. వాస్తవాల్ని పవన్ కల్యాణ్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.