అయేషా మీరా హత్య కేసులో ఇప్పటికే చాలా సుదీర్ఘ విచారణ సాగింది. వివాదాస్పదంగా మారిన ఈ కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని పోలీసులు నిందితుడుగా పట్టుకున్నారు. చాలా కాలం పాటు అతడిని జైల్లో కూడా ఉంచారు. అయితే అతడు దోషి అని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలను చూపలేకపోయారు. ఈ కేసులో సీబీఐ విచారణ కూడా సాగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకూ ఒక కొలిక్కి రాలేదు.
ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నట్టుగా ఉన్నారు. కొన్నాళ్ల కిందట సీబీఐ అధికారులు అయేష మీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే అందుకు మతపెద్దలు ఒప్పుకోలేదట. దీంతో ఆ కేసు విచారణ ఆగింది. ఇటీవల దిశపై ఘాతుకం నేపథ్యంలో ఈ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. అధికారులపై ఒత్తిడి పెరిగింది.
దీంతో రీ పోస్టు మార్టానికి వెళ్లారు. అయేషాను ఖననం చేసిన శ్మశాన వాటికలో ఆమె మృతదేహాన్ని తవ్వి తీసి రీ పోస్టు మార్టం చేయిస్తున్నారు. పన్నెండేళ్ల కిందట ఖననం అయిన మృతదేహం నుంచి అధికారులు ఇప్పుడు ఏం ఆధారాలు రాబడతారు అనేది సామాన్యుడి ఊహకు అందనిది. అయితే ఫోర్సెనిక్ సైన్స్ బాగా డెవలప్ అయ్యిందని, ఆధారాలు దొరుకుతాయని అంటున్నారు నిపుణులు.
తమ కుమార్తె మృతదేహానికి రీపోస్టు మార్టానికి తమకు అభ్యంతరం లేదని అయేషా తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పునఃవిచారణతో అయినా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.