రాజధాని అమరావతి కాదా? మరెందుకు ఆ వార్తకు సాక్షి దినపత్రికలో ప్రాధాన్యం ఇవ్వలేదు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని జగన్ సర్కార్ భావిస్తుంటే…దానికి సాక్షి ఇచ్చే ప్రాధాన్యం వేరేగా ఉంటుందని తెలిసిన విషయమే. మండలిలో శుక్రవారం శాసనమండలి సభ్యులు పి.శమంతకమణి, జి.దీపక్‌కుమార్, పి.అశోక్‌బాబు శుక్రవారం అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యానారాయణ బదులిస్తూ రాజధాని మార్పుపై తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు.
రాజధానిని శ్మశానంతో పోల్చిన నోటితోనే, అమరావతి మార్పుపై ఎలాంటి ప్రతిపాదన రాలేదని బొత్స చెప్పడం ఎంతో ముఖ్యమైంది. కొంత కాలంగా రాజధాని మార్పుపై రాష్ర్టంలో అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. ముంపు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అంత శ్రేయస్కరం కాదని పాలకపక్షం పదేపదే చెబుతూ వస్తోంది. అంతేకాకుండా రాజధానిపై అభిప్రాయ సేకరణ కోసమంటూ ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ రాష్ర్టమంతా పర్యటిస్తూ ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. అంతేకాకుండా మెయిల్స్ ద్వారా కూడా ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది.
రాజధాని మార్పుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజధానికి భూమిలిచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు ఆయనపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలిలో బొత్స సత్యనారాయణ స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన సారాంశం రాజధాని మార్పు జరగదని. దీన్ని సాక్షి మినహా అన్ని పత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించాయి.
“రాజధాని మార్చం” శీర్షికతో ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇండికేషన్ ఇచ్చి లోపలి పేజీలో వార్త క్యారీ చేశారు. అలాగే ఉప శీర్షికలుగా అలాంటి ప్రతిపాదన లేదు, టీడీపీ ఎమ్మెల్సీ ప్రశ్నకు ప్రభుత్వ సమాధానం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రభలో “రాజధాని అమరావతే” అని బ్యానర్ వార్తగా ఇచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రభ గతంలోనే ఈ విషయాన్ని చెప్పిందంటూ ఎక్స్‌క్లూజివ్‌గా పేర్కొంటూ కథనాన్ని నడిపారు. ప్రజాశక్తిలో కూడా “అమరావతే రాజధాని” శీర్షికతో మొదటిపేజీలో వార్త ఇచ్చారు.
ఇక ఈనాడు విషయానికి వద్దాం. “రాజధాని అమరావతే” అంటూ తాటికాయంత హెడ్డింగ్‌తో బ్యానర్ వార్తగా ఇచ్చారు. అలాగే దానిని మార్చే ప్రతిపాదన లేదు…..మండలిలో మంత్రి బొత్స స్పష్టీకరణ అని విస్పష్టంగా ఇచ్చారు. అంతేకాకుండా మొదటి పేజీలో…. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని రాష్ర్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి నుంచి రాజధానిని మార్చే ప్రతిపాదన లేదని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విస్పష్టం చేశారు. శాసనమండలి సభ్యులు పి.శమంతకమణి, జి.దీపక్‌కుమార్, పి.అశోక్‌బాబు శుక్రవారం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారంటూ వార్త ఇచ్చారు. మండలికి సంబంధించిన వార్తను రెండో పేజీలో కూడా కొనసాగించారు.
ఇక జగన్ మానసపుత్రిక సాక్షికి వద్దాం. “రాజధాని మార్చే ప్రతిపాదనేదీ లేదు” అనే శీర్షికతో లోపల పేజీల్లో ఓ రెండులైన్ల వార్త ఇచ్చారు. నిజంగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే ఉద్దేశం జగన్ ప్రభుత్వానికి ఉంటే…అత్యంత ముఖ్యమైన బొత్స ప్రకటనకు సాక్షి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నది ప్రధాన ప్రశ్న, అనుమానం.
సాక్షికి జగన్ కంటే మిగిలినవేవీ ఇంపార్టెంట్ కాదు కదా? రాజధాని అమరావతి విషయమై కొన్ని లక్షల మంది జగన్ సర్కార్ వివరణ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సమాచారాన్ని తెలియజేసే వార్తను సాక్షిలో ఎందుకు మూలనపడేశారో అర్థం కావడం లేదు. ఏదో మిస్‌కాకుండా ఇచ్చినట్టుందే తప్ప…ఇష్టంగా ఇచ్చినట్టు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలను ఎల్లో మీడియా సంస్థలనుకున్నా, ప్రజాశక్తి, ఆంధ్రప్రభలాంటి పత్రికలు కూడా ఆ వార్తకు ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించాయి కదా? అలాంటి ప్రతిపాదనేదీ లేదంటే…భవిష్యత్‌లో ఏవైనా వస్తే మారుస్తామని బొత్స మాటలను , సాక్షి వార్తను బట్టి అర్థం చేసుకోవాలా? ఏమో ఏమైనా జరిగేలా ఉంది