తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో దేశం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, ఇతర ఉన్నతాధికారులు ప్రయాణిస్తుండడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనపై కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్నారు.
ఈ కీలక ప్రకటన బహుశా వినకూడని చేదు వార్తే అయి వుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అత్యవసర సమావేశం అయ్యారు. ఘటనపై చర్చించారు. హెలికాప్టర్ మంటల్లో ఆహుతి కావడానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
సైనిక విమానంలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం మీద దీనిలో 14 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. వీరిలో నలుగురు మరణించినట్లు, ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వార్తలొస్తున్నాయి.
ప్రమాదంలో దేశంలోనే అత్యున్నత సైనిక అధికారి, ఆయన భార్య, ఇతర ఉన్నతాధికారులు ఉండడంతో రక్షణశాఖ మంత్రే స్వయంగా కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐఏఎఫ్ ఎంఐ-17వీ5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు వాయుసేన (ఐఏఎఫ్) ప్రకటించింది. ఈ దుర్ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ఏది ఏమైనా రక్షణ మంత్రి కాసేపట్లో వెలువరించనున్న కీలక ప్రకటనపై ఉత్కంఠ నెలకుంది.