ఒమిక్రాన్ వార్తలు లేకపోతే.. ఈ పాటికి కరోనా గురించి చర్చకు కూడా ఎక్కడా స్థానం ఉండేది కాదేమో! వాస్తవానికి ఇండియాలో కరోనానే కాదు, కరోనా వ్యాక్సిన్ ను కూడా ప్రజలు పట్టించుకోవడం బాగా తగ్గిపోయింది. కొన్ని కోట్ల మంది రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకునే సమయం వచ్చినా దాన్ని పట్టించుకోవడం లేదు. వీరి సంఖ్య 20 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా!
ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నా, తమ వంతు వచ్చినా చాలా మంది రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. దీంతో కోట్ల కొద్దీ డోసులు ప్రభుత్వం వద్ద మిగిలిపోతున్నట్టుగా ఉన్నాయి. ఇదెంత వరకూ వచ్చిందంటే.. మొన్నటి వరకూ వ్యాక్సిన్ డోసుల కోసం వాటి తయారీదారుల వెంట పడిన కేంద్ర ప్రభుత్వం కూడా, ఇక చేసేదేమీ లేక కొత్త వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్లను తగ్గించేసినట్టుగా ఉంది.
ఇక ఇతర దేశాల్లో కూడా వ్యాక్సిన్ ను లైట్ తీసుకోవడంతో.. ఈ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసే డిమాండ్ కూడా పెద్దగా లేకపోవడంతో.. దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తిని తగ్గించి వేస్తున్నాయట. కోవీషీల్డ్ తయారీదారులు ఈ ప్రకటన చేశారు. ఆర్డర్లు లేకపోవడంతో కోవీషీల్డ్ ఉత్పత్తిని ఏకంగా సగానికి సగం తగ్గించేయనున్నట్టుగా సీరం ఇండియా ప్రకటించింది.
ఈ ఏడాది డిసెంబర్ లాస్ట్ కు దేశంలో వంద శాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మధ్యనే ఇందుకు సంబంధించి యాభై శాతం లక్ష్యం పూర్తయినట్టుగా వార్తలు వచ్చాయి. కనీసం యాభై శాతం జనాభా రెండో డోసు వ్యాక్సిన్ ను పొందినట్టుగా ప్రకటన వచ్చింది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్ పొందిన వారి శాతం ఇంతకన్నా ఎక్కువగా ఉంది. ఎటొచ్చీ రెండో డోసు విషయంలో ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయింది.
ఒక దశలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి పోటీ పడ్డ వాళ్లు కాస్తా.. తమ టర్న్ వచ్చినా రెండో డోసు వ్యాక్సిన్ ను మాత్రం వేయించుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా ప్రజల వెంట పడ్డాయి. ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేసే ప్రయత్నాలూ జరిగాయి. ఫోన్లు చేయడమూ జరిగింది. అయినా ప్రజల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశ ప్రజలకు అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్లు తయారవుతాయా? అనే ప్రశ్న తలెత్తింది ఒక దశలో! అయితే ఇప్పుడు డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నామని తయారీదారులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. ఇంతలోనే ఎంత తేడా!