ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదమైన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఓ మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని, అది వాడుకోవాలా? లేదా? అనేది ప్రజల ఇష్టమని ఆయన తేల్చి చెప్పారు.
ఎప్పుడో ఇచ్చిన గృహాలకు జగన్ ప్రభుత్వం డబ్బు వసూలు చేయడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణం, ఓటీఎస్ పథకంపై సీఎం జగన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఓటీఎస్ అనేది పూర్తి స్వచ్ఛందమని జగన్ స్పష్టం చేశారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు. క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతోందని సీఎం పేర్కొన్నారు.
లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు వస్తాయనే విషయమై ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. ఆర్థిక అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చని,అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పేదలకు కల్పిస్తున్న మంచి అవకాశాలు వాడుకోవాలా? లేదా? అన్నది వారిష్టమని జగన్ మరోసారి తేల్చి చెప్పారు.
భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతాయని సీఎం చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు ముందుకొచ్చి ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని తద్వారా ఏ మాత్రం లబ్ధి పొందుతారో చూడాల్సిందే.