అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలనేది పెద్దల మాట. ఇదే విషయమై ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హితవు చెప్పడం విశేషం. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలతో వుంది. దీంతో అధికారాన్ని మూడోసారి నిలుపుకోవాలని బీఆర్ఎస్ దీటుగా ఎదుర్కొం టోంది. ఈ నేపథ్యంలో ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు.
తెలంగాణలో మెడికల్ కాలేజీల విషయమై కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలా ఒక మాట చెబుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం అబద్ధాలైనా అందరూ ఒకేలా చెప్పాలని ఆయన ట్విటర్ వేదికగా ప్రధాని మోదీకి హితవు చెప్పడం విశేషం.
తెలంగాణకు 9 వైద్యకళాశాలలు మంజూరైనట్టు తమ రాష్ట్రానికి చెందిన మంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారని, అలాగే మరో మంత్రి మన్సుక్ మాండ వీయ మాత్రం కనీసం ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని అంటున్నారని చెప్పుకొచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తెలంగాణకు మెడికల్ కాలేజీల కోసం రెండు ప్రతిపాదనలు వచ్చినట్టు చెప్పారన్నారు.
ఇలా ముగ్గురు కేంద్ర మంత్రులు పొంతన లేకుండా మెడికల్ కాలేజీల విషయమై మాట్లాడాన్ని కేటీఆర్ తప్పు పడుతూ ట్వీట్ చేశారు. ‘మోదీజీ.. కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి’ అంటూ కేటీఆర్ వ్యంగ్య ట్వీట్ చేశారు. అబద్ధాలు చెప్పిన ముగ్గురు కేంద్రమంత్రుల్లో కిషన్‌రెడ్డి ఆపర మేథావి అని కేటీఆర్ తనదైన స్టైల్‌లో దెప్పి పొడిచారు.