తిరుమల శ్రీవారి పాదాల చెంత మరణిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందనే గుడ్డి నమ్మకం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకొంది. శ్రీవారి ఆలయం ఎదుటే శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం కోసం పాలు తీసుకొచ్చిన లారీ కింద గుర్తు తెలియని వ్యక్తి దూరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెనక చక్రం కిందికి దూరడం, భక్తుడిపై వాహనం వెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.మొదట్లో దీన్ని ప్రమాదంగా భావించారు. అయితే సీసీ కెమెరాల్లోని ఫుటేజీ చూసిన తర్వాత ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది.
ఇదిలా ఉండగా ఆలయ మాఢ వీధుల్లో మరణం సంభవించడంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. కొంతసేపు దర్శనం నిలుపుదల చేశారు. ఆ తర్వాత పూజాది కార్యక్రమాలు చేసి దర్శనాన్ని యధాతథంగా కొనసాగించారు.ఈ ఉదంతంపై టీటీడీ ఆగమ సలహాదారులు రమణదీక్షితులు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సహజ మరణం సంభవిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందే తప్ప ఆత్మహత్యకు పాల్పడితే స్వర్గం కలగదన్నారు.
ఇది పాపం కూడా అవుతుందని ఆయన హెచ్చరించారు. భక్తులెవరూ ఇలాంటి పాపకార్యకలాపాలకు పాల్పడొద్దని ఆయన సూచించారు.తిరుమల కాటేజీల్లో అనేక మార్లు పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాని ఆలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడడం ఇదే మొదటిసారి.
మూఢవిశ్వాసాలతో బలవన్మరణానికి పాల్పడవద్దని ఆలయ పూజారులు,ఆగమసలహాదారులు ఎంత చెబుతున్నా ఇలాంటివి అప్పుడప్పుడు తిరుమలలో చోటు చేసుకుంటున్నాయి. దీంతో తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రీవారు భక్తుడి చావు కోరుకోరని, బతికి ఉండగానే జీవితంలో స్వర్గాన్ని రుచి చూడాలని ఆలయ పూజారులు సూచిస్తున్నారు.