ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సిందే. ఉదాహరణకు రాష్ట్రపతి పదవినే తీసుకుంటే,ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు,ఎలాంటి కేసులు వేయకూడదు, విచారణ నుంచి కూడా రాష్ట్రపతికి మినహాయింపు ఉంటుంది.
మరీ ఇంత కాకపోయినా స్పీకర్ పదవి కూడా అత్యున్నతమైనదే. ఆ కుర్చీని కించపరిచేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఈ విషయంలో కోర్టులు కూడా ఏమీ చేయలేవు.అలాంటి స్పీకర్ కుర్చీనే వర్మ అవమానించాడంటున్నారు కొంతమంది వైసీపీ నేతలు.అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో అసెంబ్లీ స్పీకర్ పాత్ర ఉంది.
పమ్మినేని రామ్ రామ్ అనే ఆ పాత్రను సీనియర్ కమెడియన్ అలీ పోషించారు. ఆ పాత్రతో సినిమాతో వర్మ చాలా కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. కెప్ట్ క్వయిట్ అనే డైలాగ్ ను పదేపదే చెప్పించడంతో పాటు.. కుర్చీలో కునుకు తీసినట్టు, తినడానికే కుర్చీలో కూర్చున్నట్టు చూపించాడు వర్మ.
అతడు చూపించిన కామెడీ పండిందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. స్పీకర్ పాత్రను అలా కామెడీగా చూపించడాన్ని వైసీపీ నేతలు కొంతమంది ఎత్తిచూపుతున్నారు. ప్రజాప్రతినిధులపై ఎన్ని జోకులైనా వేయొచ్చు కానీ స్పీకర్ పదవిపై సెటైర్లు వేయడాన్ని తప్పుబడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
ఈ విషయాన్ని చూసీచూడనట్టు వదిలేద్దామా లేక చర్యలకు సిఫార్స్ చేద్దామా అనే అంశంపై కొంతమంది మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ విషయాన్ని మాత్రం ముఖ్యమంత్రి వరకు ఎవరూ తీసుకెళ్లలేదు.అటు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎంచక్కా తన సినిమాను విడుదల చేసి చేతులు దులుపుకున్నాడు.
ఈ సినిమాతో తనకు ఇక ఏమాత్రం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు.ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమా ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు. చైనాలో బ్రూస్ లీ జన్మించిన నగరంలో ఈ సినిమా ఇంటర్నేషనల్ ట్రయిలర్ ను లాంఛ్ చేశారు. ప్రస్తుతం వర్మ అక్కడే ఉన్నాడు.