చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. నేర్చుకునే తత్వం ఉన్న వారికి చరిత్రకు మించిన అధ్యయనం కూడా వేరే లేదు! సమకాలీన అంశాల్లో తాము సక్సెస్ కావాలన్నా.. చరిత్ర గురించిన అవగాహన చాలా అవసరం! మరి ఇక్కడ చరిత్ర అంటే అశోకుడు, గుప్తుల కాలం గురించిన కాదు! తాము ఎవరితో వ్యవహారం చేస్తున్నామో ఆ వ్యక్తుల చరిత్ర!
ఇప్పుడు సరిగ్గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం గురించి చెప్పాలంటే, ఆయనకు పాఠాలు నేర్చుకునే ఓపిక కానీ, ఆ తత్వం కానీ లేదని స్పష్టం అవుతోంది. ఇప్పటికే పార్టీ పెట్టి పదేళ్లను పూర్తి చేసుకుంటున్న పవన్ కల్యాణ్ తన పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు! మరి పార్టీ నిర్మాణం గురించి శ్రద్ధ పెట్టని పవన్ కల్యాణ్, దాన్ని నిర్మించేలోపే శిథిలం చేయడానికి కూడా విజయవంతంగా అడుగులు వేస్తున్నాడని చెప్పకతప్పదు!
తెలుగుదేశం పార్టీతో పొత్తు.. ఇదే జనసేన పార్టీ ఇప్పటి వరకూ ఒక నిర్మాణ స్థాయికి రాకపోవడానికి కారణం, ఇన్నాళ్లూ ఆ పొత్తు కొన్నాళ్లు బాహాటంగా, మరి కొన్నాళ్లు చీకటి పొత్తుగా సాగింది. ఇప్పుడు మరోసారి పవన్ బాహాటమైన పొత్తుకు రెడీ అయ్యాడు. బహుశా జనసేన భవిష్యత్తు ఏమిటో చెప్పడానికి ఈ పొత్తు అంశం చాలు!
ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుతో రాజకీయంగా పొత్తు పెట్టుకుని బాగుపడ్డ పార్టీ ఉమ్మడి ఏపీ చరిత్రలో లేదు! బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, టీఆర్ఎస్.. ఇలా ఎప్పటి ఎన్నికల్లో అయినా.. చంద్రబాబుతో చేతులు కలిపిన వారికి మిగిలింది బూడిదే తప్ప అంతకు మించి ఏమీ లేదు!
చంద్రబాబుకు తెలుసు..తన ఛరిష్మా ఒంటరిగా గెలిచేంత స్థాయిలో లేదనేది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తుకు దేబిరిస్తూ ఉంటాడు. ఇది ఒక ఎత్తు అయితే.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదో వైరస్ సోకినట్టుగా వీక్ అయిపోతూ ఉంటుంది! అదే స్థాయి పార్టీ అయినా.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అంటే బక్కచిక్కి బలహీనం అయిపోవడమే తప్ప, బలవర్ధకం అయ్యే పరిస్థితి ఉండదు!
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ బీజేపీ! జాతీయ స్థాయిలో పదేళ్లుగా అధికారంలో ఉన్నా.. ఇప్పటికీ ఏపీలో బీజేపీ ఇంత బలహీన స్థితిలో ఉండటానికి ఆ పార్టీ దశాబ్దాల పాటు టీడీపీతో చేసిన దోస్తీనే తప్ప మరో కారణం లేదు! చంద్రబాబు అవసరానికి ఉపయోగపడటమే తప్ప.. ఏపీలో బీజేపీకి మరో విధి లేకపోయింది. అదే చేస్తూ.. చేస్తూ.. నిర్వీర్యం అయిపోయింది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత బీజేపీ తెలంగాణలో కాస్తో కూస్తో పుంజుకుంది. అయితే చంద్రబాబు రాజకీయం ఉన్న ఏపీలో మాత్రం కమలం పార్టీ కనీస ఉనికి లో కూడా లేదు!
ఇక కమ్యూనిస్టుల పతనం తీవ్ర స్థాయికి చేరింది కూడా 2009లో చంద్రబాబుతో పొత్తు తర్వాతే! 2004లో చంద్రబాబుకు ఎదురెళ్లి కమ్యూనిస్టులు తమ చరిత్రలోనే గొప్ప స్థాయిలో ఏపీ అసెంబ్లీలో, ఏపీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యాన్ని సంపాదించారు. 2009లో చంద్రబాబుతో చేతులు కలిపి.. నిర్వీర్యం అయ్యారు. ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు!
మరి ఎవరో కాదు.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఎంత నష్టమో చెప్పుకోదగిన ఉదాహరణల్లో పవన్ కల్యాణ్ కూడా ఒకరు! చంద్రబాబు చెప్పినట్టుగా ఆడుతూ పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఆఖరికి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. ఈ విషయంలో ఆయన అభినమానులను నిందిస్తూ ఉంటాడు! వారు కూడా ఓటేయలేదని, అందుకే తను ఓడిపోయానంటూ చెప్పుకుంటూ ఉంటాడు.
అయితే పవన్ కు ఈ మాత్రం ఉనికి ఉందన్నా.. అది అభిమానుల వల్లనే. పవన్ కు రాజకీయంగా ఏదైనా దక్కిందంటే అధి అబిమానుల వల్లనే! ఆయనకు ఎదురైన వ్యతిరేకత అంతా చంద్రబాబు వల్లే! చంద్రబాబు వ్యూహాల్లో పావుగా మారడం వల్లనే పవన్ కల్యాణ్ రాజకీయంగా తన పరపతిని చాలా వరకూ తగ్గించేసుకున్నాడు. మరి ఈ పాటి చరిత్ర నుంచి కూడా పాఠాలను నేర్చుకుని తన పరిస్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం లేదు పవన్ కల్యాణ్. మరోసారి పవన్ చంద్రబాబు పల్లకి మోసే బోయిగా మారారు!
మరి పవన్ చెప్పిన పాతికేళ్ల రాజకీయంలో పదేళ్లు ఈ పతానవాస్థలోనే సాగాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబుతో దోస్తీతో తన రాజకీయ జీవితాన్ని పవన్ స్వయంగా దెబ్బతీసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు!