పార్లమెంటు కొత్త భవనంలో ప్రారంభమైన ప్రత్యేక సమావేశాలలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమైనదని వారు చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను గమనిస్తుంటే.. ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రశ్నార్ధకం అవుతోంది. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన తేలిన తర్వాత గాని, మహిళా రిజర్వేషన్లు అమలులోకి రావు అన్నప్పుడు.. ఇంత హడావుడిగా ప్రత్యేక సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనేది ఒక జనాకర్షణ గిమిక్కు లాగా కనిపిస్తోంది.
ప్రస్తుతం పార్లమెంటు ఎదుట బిజెపి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కానేకాదని కేంద్రం ప్రకటించింది. సరికొత్త అంశాలతో ఈ బిల్లును తీసుకు వచ్చామని కూడా పేర్కొంది. అంతవరకు మంచిదే! కానీ బిల్లు- చట్ట రూపం దాల్చిన తర్వాత ఎప్పటి నుంచి అమలు చేయాలనుకుంటున్నారనే విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కసరత్తును ఇప్పటిదాకా నామమాత్రంగా కూడా మొదలెట్టకుండానే, ఆ వ్యవహారంతో మహిళా రిజర్వేషన్లు ముడి పెడుతున్నారు. ఎప్పటిలోగా అమల్లోకి తీసుకు రాగలరని మోడీ సర్కారు ఒక నిర్దిష్టమైన గడువును ప్రకటించగల స్థితిలో ఉన్నదా? అనేది ప్రజల సందేహం. పైగా అమలులోకి వచ్చిన తర్వాత కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఈ రిజర్వేషన్లు ఉంటాయనే అంశం మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత స్థానాలు మారుతూ ఉంటాయని అంశం మీద కూడా పార్టీలో రకరకాలుగా స్పందిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును ఆమోదించిన ప్రభుత్వంగా కీర్తిని తమ ఖాతాలో అర్జెంటుగా వేసుకోవడానికి మాత్రమే ఇప్పటికిప్పుడు బిల్లుతెస్తున్నదని.. తక్షణం అమలు చేసే ఉద్దేశం వారికి లేదని విమర్శలు వస్తున్నాయి.
మహిళా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత.. నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపడి ఉన్నది కనుక.. అమలు ఆలస్యం కావచ్చు. కానీ, పార్టీలు రాబోయే ఎన్నికల నుంచే తాము కేటాయించే టికెట్లు 33 శాతం మహిళలకు ఇవ్వడం ద్వారా.. మహిళా సమాజం పట్ల తమ గౌరవాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అయినా సరే అనివార్యంగా చేయవలసి వచ్చే పనిని.. ముందుగానే సంస్థాగతంగా అమలులోకి తెస్తే.. ఆయా పార్టీలకు మంచి పేరు దక్కుతుంది.