తోక పట్టుకు వేలాడుతున్న చంద్రబాబు న్యాయవాదులు!

ఇంతకూ చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్టు చేశారు? బహుశా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఈపాటికి మరిచిపోయి కూడా ఉండొచ్చు! ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ముసుగులో చంద్రబాబు నాయుడు 371 కోట్ల…

ఇంతకూ చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్టు చేశారు? బహుశా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఈపాటికి మరిచిపోయి కూడా ఉండొచ్చు! ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ముసుగులో చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారని, దొంగ కంపెనీలకు తరలింప చేయడం ద్వారా అంతిమ లబ్ధిదారుగా తానే స్వాహా చేశారని సిఐడి చేసిన ఆరోపణలు, నమోదు చేసిన కేసులు ఇప్పుడు అంత ప్రధానంగా చర్చకు రావడం లేదు.  

తెలుగుదేశం నాయకులు, పచ్చ మీడియా పూనికతో చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా.. ఆయన అరెస్టు అక్రమంగా అరాచకంగా జరిగిందని అంటున్నారే తప్ప..  ఆయన తప్పు చేయలేదని అవినీతికి పాల్పడలేదని అనడం లేదు. ఈ వ్యవహారం ఎంత తమాషాగా నడుస్తున్నదంటే.. చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు.. అనే వాదనను ఆయన న్యాయవాదులు కూడా మరిచిపోయారు. వారు పూర్తిగా ఆయన అరెస్టు అక్రమం చట్ట విరుద్ధం అని, ఆయనకు వేయించిన రిమాండ్ చెల్లదని మాట్లాడటం మీదనే ఫోకస్ పెడుతున్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన వ్యవహారంలో ఆయన తరపు న్యాయవాదులు కూడా అసలు కేసును పూర్తిగా విస్మరించి తోక పట్టుకుని వేలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకు రిమాండ్ తప్పించి జైలు నుంచి బయటకు తీసుకువస్తే చాలు.. ఆయన చేసిన అవినీతి గురించి రాబోయే కొన్ని దశాబ్దాల పాటు కోర్టుల్లో వాదులాడుకుంటూ ఉండవచ్చు.. అనే ధోరణిలో పడ్డట్టుగా కనిపిస్తోంది.

మంగళవారం నాడు ఏపీ హైకోర్టులో జరిగిన వాదప్రతివాదాలలో చంద్రబాబు తరఫున రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ హరీష్ సాల్వే.. లండన్ నుంచి వర్చువల్ పద్ధతిలో తన వాదనలను వినిపించారు. సుప్రీంకోర్టు మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. తను నుంచి చంద్రబాబు కేసును వాదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ  రంగంలోకి దిగారు.  

అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17 ఏ నిబంధనలను అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకుని మాత్రమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కేసులు నమోదు చేయాలని చంద్రబాబు న్యాయవాదులు చెప్పడం గమనార్హం. సెక్షన్ 17 ఏ అనేది అసలు చంద్రబాబుకు వర్తించే అవకాశం లేదని సిఐడి న్యాయవాదులు పేర్కొంటున్నారు. వీరి వాద ప్రతివాదాలను గమనిస్తే చంద్రబాబు చేసిన అసలు అవినీతిపని పక్కకు మళ్ళి పోతోంది. ప్రస్తుతానికి ఈ విషయంలో హైకోర్టు తీర్పు రిజర్వు చేసి ఉండడం గమనార్హం.