పచ్చ మీడియా ప్రతినిధులందరికీ ఇప్పుడు ఒకే ఒక్క అజెండా అంశం కనిపిస్తోంది. తాము బయట తిరుగుతున్నప్పుడు ఏ నాయకుడు కనిపించినా సరే.. ఏ నిపుణుడు కనిపించినా వారి లక్ష్యం ఒకే ఒక్కటి! చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి వారి స్పందనను అడిగి తెలుసుకోవడం.
చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ క్రమం అని, అరాచకంగా అరెస్టు చేశారని వారితో చెప్పించడం! వారి మాటలను తమ తమ పత్రికలలో పతాక శీర్షికలలో అందివ్వడం! పచ్చ మీడియాలో పబ్లిసిటీ పొందాలంటే చిల్లర మల్లార నాయకులకు కూడా షార్ట్ కట్ దారులు తెలిసిపోతున్నాయి.
ప్రస్తుత సందర్భంలో పార్టీలతో నిమిత్తం లేకుండా.. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, తప్పుపడుతూ చిన్న డైలాగు వేస్తే చాలు! అది ప్రముఖంగా పబ్లిష్ అవుతుంది. ఏదో ఒక రకంగా పత్రికల్లో కనిపిస్తూ ఉంటే చాలు అని కోరుకునే కేటగిరీకి చెందిన అనేక మంది నాయకులు పచ్చ మీడియా ఉచ్చులో పడుతున్నారు. చంద్రబాబు అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు.
తమాషా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ వ్యవహారం మీద.. తెలంగాణలో తమిళనాడులో ఇతర ప్రాంతాలలో కూడా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉండడమే! వారికి చంద్రబాబు చిత్తశుద్ధి మీద ఆయన నిజాయితీ మీద నిజంగానే అంత నమ్మకం ఉంటే గనుక.. పరిస్థితి మరో తీరుగా ఉంటుంది.
చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అరాచకం అని ఎంతో మంది చెబుతున్నారు గాని.. వారిలో ఏ ఒక్కరు కూడా తమంత తాముగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ముక్క అందరు విలేకరులకు చెప్పడం లేదు. పచ్చ మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు మాత్రమే వారికి కావలసిన రీతిలో స్పందిస్తున్నారు. దాని ఫలితంగానే తెలంగాణ వంటి రాష్ట్రంలో అటు బారాస ఎమ్మెల్యేలు, బిజెపి నాయకులు, కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఉండడం గమనార్హం.
కొందరు తెలివితేటలు ముదిరిపోయిన నాయకులు పచ్చ మీడియా ఎజెండాకు అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తూనే.. మధ్యలో తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకులైతే.. చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ల హస్తమున్నదని అందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
పచ్చ మీడియా కోసం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ, మధ్యలో మోడీని నిందించారని తమ ఎజెండాను కూడా చొప్పిస్తున్నారు. మొత్తానికి ఇలాంటి బలవంతపు ప్రకటనల ద్వారా పచ్చ మీడియా చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తుండగా.. లేదా ఆయన జీవితాన్ని మరింతగా నవ్వుల పాలు చేస్తున్నదా అని ప్రజలలో సందేహం కలుగుతోంది.