తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఈ నెలాఖరుకు లేదా అక్టోబర్ మొదటి వారంలో విడుదల కావచ్చని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కెసిఆర్ చాలామందిగా ప్రకటించిన జాబితా తప్ప.. భారతీయ జనతా పార్టీ కూడా అందు తొందరగా ప్రకటించే కసరత్తులో లేని నేపథ్యంలో.. అక్టోబర్ మొదటి వారంలో కాంగ్రెస్ తొలి జాబితా వచ్చినా కూడా మరీ పెద్ద ఆలస్యం కాకపోవచ్చు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల కోసం పోటీలేని నియోజకవర్గాలకు కూడా పేర్లను ప్రకటించడానికి ఎందుకు జాగు చేస్తున్నారనేదే అర్థం కావడం లేదు.
తెలంగాణలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 1006 దరఖాస్తులు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. వీటిలో సుమారు 40 స్థానాలకు ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులు దరఖాస్తు చేయలేదు కూడా. అంటే మీరందరూ పార్టీలోని కీలక నాయకులు, టికెట్ గ్యారెంటీ ఉన్నవారు, స్థానికంగా టికెట్ కోసం పోటీ లేనివారు అని భావించవచ్చు. అయినా సరే ఈ 40 స్థానాల పేర్లను వెల్లడించడానికి కూడా పార్టీ మేనేమేషాలు లెక్కిస్తూనే ఉంది.
అభ్యర్థుల దరఖాస్తులను వడపోతపోసి షాట్ లిస్ట్ చేయడానికి రాష్ట్రస్థాయిలోని స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే విడతలుగా సమావేశమైంది. ఆమేరకు వారు జాబితాలను కూడా రూపొందించారు. హైదరాబాద్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత, ఢిల్లీ వేదికగా బుధ, గురువారాలలో స్క్రీనింగ్ కమిటీ మళ్ళీ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో షార్ట్ లిస్ట్ చేసే పేర్లను.. కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతారు. దానిని పరిశీలించి వారు ఫైనల్ గా అక్టోబర్ మొదటి వారంలోగా జాబితా ప్రకటిస్తారని పిలుస్తోంది.
ఇద్దరు ముగ్గురు కీలక నాయకులు ప్రధానంగా అభ్యర్థిత్వాన్ని ఆశించే నియోజకవర్గాల విషయంలో, వారిని బుజ్జగించడానికి పార్టీ సమయం తీసుకుని, జాప్యం చేసినా అర్థముంది. ఒకరి కంటే ఎక్కువ మంది అసలు టికెట్లే ఆశించని నియోజకవర్గాలలో కూడా ఆలస్యం చేయడమనేది కాంగ్రెస్ పార్టీ అపహాస్యం కావడానికి దారితీస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అధిష్టానం ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ ఉంటుందని భారాస నాయకులు ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో.. టికెట్లు తేల్చే దానికి ఇంతింత ఆలస్యం చేస్తుండడం చర్చనీయాంశం అవుతుంది.
కాంగ్రెస్లో ప్రస్తుతం 40 స్థానాలకు అసలు పోటీ లేకపోగా, 30 నుంచి 35 స్థానాలకు ఇద్దరే అభ్యర్థులు టికెట్ కోసం తలపడుతున్నట్లుగా సమాచారం. అసలు దరఖాస్తు చేయకుండానే.. ఆ పర్వం ముగిసిన తర్వాత పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, బాలకృష్ణారెడ్డి తదితరులకు ఎలాంటి అవకాశం కల్పిస్తారో చూడాలి. షర్మిల తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో, అందుకు ఆమెకు పార్టీ చేయబోతున్న ప్రత్యుపకారం ఏమిటో కూడా తేలవలసి ఉంది.