అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పుపై రివ్యూ కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లూ కొట్టివేతకు గురయ్యాయి. సుమారు ఎనిమిదేళ్ల పాటు విచారించి ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొంతమంది వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు తో సహా పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ మొత్తం పంతొమ్మిది పిటిషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది.
వాటన్నింటినీ కోర్టు కొట్టి వేసింది. వాటికి విచారణ అర్హతే లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో అయోధ్య విషయంలో ఐదు మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అవుతోంది.
ఈ వ్యవహారంలో కొంతమంది పిటిషనర్లు సుప్రీం ధర్మాసనం తీర్పు తర్వాతే వెనక్కు తగ్గారు. ధర్మాసనం తీర్పుపై రివ్యుకు వెళ్లే ఆలోచన లేదని అప్పుడే కొంతమంది ప్రకటించారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం రివ్యూ పిటిషన్ పట్ల ఉత్సాహం చూపించింది.
అయితే ఈ రివ్యూ పిటిషన్లను కోర్టు తీసుకుంటుందా? అనే అనుమానాలు అప్పుడే వ్యక్తం అయ్యాయి. వాటికి అనుగుణంగానే అన్ని పిటిషన్లనూ కోర్టు కొట్టివేసింది. రివ్యూ పిటిషనర్లకు దాదాపుగా అన్ని దార్లూ మూసుకుపోయినట్టే అని, మరో మార్గం ఏదో ఉందని..అయితే అది కూడా ఇక వర్కవుట్ కాకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.