మహారాష్ట్రలో ఏర్పడిన శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల ప్రభుత్వంలో పదవుల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటికే ముఖ్యమంత్రి, ఆరు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసి పదిహేను రోజులు గడిచిపోయాయి. అయితే ఇప్పటి వరకూ పూర్తి స్థాయి కేబినెట్ లేకపోయింది. ఈ విషయంలో విమర్శలు కూడా మొదలయ్యాయి.
సీఎంతో సహా ఆరు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. కేబినెట్ ఊసు లేదు. ఆ ఆరు మందికీ ఏ శాఖలు దక్కింది కూడా ప్రకటించలేదు. పదవుల పంపకం విషయంలో కూటమి తర్జనభర్జనలు పడింది. కీలకమైన శాఖల విషయంలో పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ ఏర్పాటు లేట్ అయ్యింది.
ఇలాంటి నేపథ్యంలో.. ఎట్టకేలకూ పదవుల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. అందులో భాగంగా కీలకమైన శాఖలను శివసేన దక్కించుకోవడం విశేషం. హోం మంత్రిత్వ శాఖతో పాటు.. ఆర్బన్ డెవలప్ మెంట్, ఇరిగేషన్ శాఖలను శివసేన దక్కించుకుంది. వీటితో పాటు మరిన్ని శాఖలు ఆ పార్టీ మంత్రులకు దక్కాయి.
ఇక కూటమిలో రెండో పెద్ద పార్టీ ఎన్సీపీకి కీలకమైన ఆర్థిక శాఖ దక్కింది. దాంతో పాటు రూరల్ డెవలప్ మెంట్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కో ఆపరేటివ్స్.. తదితర శాఖలు దక్కాయి.
కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలకమైన శాఖలను పొందడం గమనార్హం. రెవెన్యూ మినిస్ట్రీ కాంగ్రెస్ పరమైంది. దాంతో పాటు మరిన్ని శాఖలను కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఇలా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఒక కొలిక్కి వస్తోంది.