ఒకవైపు చారిత్రాత్మక బిల్లును పాస్ చేయించామని చెప్పుకుంటున్నారు.. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు రోడ్డెక్కారు. కేవలం విదేశాల నుంచి ఇండియాలకి వచ్చిన, రావాలనుకుంటున్న ముస్లింలకు తప్ప ఈ బిల్లుతో ఎవరికీ నష్టం లేదని కమలం పార్టీ వాళ్లు చెబుతూ ఉన్నారు.
అయితే ఈశాన్య రాష్ట్రాల్లోని తెగల, గిరిజన ప్రజలు ఈ చట్టం మీద ఫైర్ అవుతూ ఉన్నారు.కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఉండిందన్నట్టుగా.. పౌరసత్వ చట్ట సవరణ మంటలు పెడుతూ ఉన్నారు. అస్సాంలో అయితే నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి.
రైల్వేస్టేషన్లను, విమాన సర్వీసులను బంద్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఆందోళన కారులపై పోలీసుల కాల్పులు కూడా జరిగాయి ఇప్పటికే. ఆ కాల్పుల్లో ముగ్గురు మరణించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అస్సాంలో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు.
అల్లర్లను అరికట్టడానికి ఈ ప్రయత్నం చేసినట్టుగా చెబుతున్నారు.అయితే మోడీ తీసుకునే నిర్ణయాలు ఈ తరహా ఆందోళనలకు కారణాలు కావడం కొత్తది ఏమీ కాదు. ఆర్టికల్ త్రీ సెవెన్టీ విషయంలో కశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. ఇప్పుడు అస్సాంలో అలాంటి పరిస్థితి తలెత్తింది. మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది.
మరో ప్రహసనం ఏమిటంటే.. ఇంటర్నెట్ సేవలను ఆపేసి, ట్విటర్ ద్వారా ప్రధానమంత్రి మోడీ అక్కడి ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆందోళన వద్దని ఆయన ట్విటర్ ద్వారా పిలుపును ఇచ్చారు. ఇంటర్నెట్ ఆపేసి.. ట్వీట్ చేయడం ఏమిటని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది.