నటన నుంచి రిటైర్మెంట్.. సినిమాల నుంచి రిటైర్మెంట్.. బహుశా ఎవరూ తీసుకోరేమో. అవకాశాలు వచ్చినన్ని రోజులూ ఆబగా ఉపయోగించుకోవడమే చాలా మంది చేసే పని. వయసు మీద పడుతున్న దశలో అవకాశాలు తగ్గడంతో హీరోయిన్లు తప్పనిసరిగా తప్పుకుంటారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో వస్తారు.
నిర్మాతలను ఒప్పించగలిగే అన్ని రోజులూ దర్శకులు కొనసాగతారు. బయటి వాళ్లు చాన్సులు ఇవ్వకపోతే సొంతంగా నిర్మాతలుగా మారతారు కొందరు దర్శకులు. ఇక నిర్మాతలు హిట్ లు తీసినన్ని రోజులూ బండి నడిపిస్తారు. కొందరు మాత్రమే ఇక చాలన్నట్టుగా వైదొలుగుతారు. హీరోలకు మాత్రం అలాంటి రిటైర్మెంట్ ఉండవు.
అరవై యేళ్లు దాటేసినా.. ఇంకా ప్రేమ సన్నివేశాల్లో నటిస్తున్నారు స్టార్లు. ఇలాంటి పరిశ్రమలోని వ్యక్తే విక్టరీ వెంకటేష్ కూడా. తను రిటైర్మెంట్ ప్లాన్స్ లో ఉన్నట్టుగా ఆయన చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే తన అన్న వాళ్లు తనను వదలడం లేదని, కానీ ఏదో ఒక రోజు జంప్ అయిపోతానంటూ విక్టరీ వెంకటేష్ వ్యాఖ్యానించడం విశేషం.
ఇలా తన రిటైర్మెంట్ ఆలోచనలను వెంకటేష్ బయటపెట్టారు. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో సినిమాలున్నాయి. వెబ్ సీరిస్ లలో చేయడానికి కూడా రెడీ అని అంటున్నారు. వెబ్ సీరిస్ లు తీసే దర్శకులైనా తన దగ్గరకు మంచి స్కిప్ట్ లతో రావాలని వెంకటేష్ సూచిస్తున్నారు.