జనసేనాని పవన్‌కల్యాణ్ మనసులో మాటను దాచుకోలేరు. అదే ఆయన బలమూ, బలహీనత. ఒక్కోసారి చాలా తెలివిగా మాట్లాడినట్టు అనిపిస్తారు.మరోసారి మరీ ఇంత బోలా మనిషేంటబ్బా అనే అభిప్రాయం ఆయన మాటలు కలిగిస్తాయి.రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటానని ఆయన అనుకుంటాడు.అంతే కానీ ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు,అడుగులు వెంటవెంటనే జనానికి తెలిసిపోతున్నాయి.
విశాఖ లాంగ్‌మార్చ్ సభలో పవన్ మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి పయనమయ్యాడు. వామ్మో పవన్ ఢిల్లీకి వెళ్లాడని, జగన్ పని అయిపోయినట్టేనని చాలా మంది అనుకున్నారు. తీరా ఆయన ఢిల్లీకి పోయి ఎవరిని కలిశాడో, ఏం చేశాడో అంతుచిక్కలేదు. రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీని విలేనం చేసేందుకు అమిత్‌షాతో చర్చలు జరపడానికే దేశ రాజధానిలో తిష్ట వేశాడనే ఊహాగానాలు గుప్పుమన్నాయి.
ఆ తర్వాత ఆయన రాయలసీమ యాత్ర మొదలు పెట్టాడు. తిరుపతి వెళ్లాడు. అమిత్‌షా అంటే తనకెంతో ఇష్టం, గౌరవమన్నాడు. దేశానికిప్పుడు అమిత్‌షానే సరైన నాయకుడని స్పష్టం చేశాడు. అంతేకాదు తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని తేల్చి పడేశాడు.
ఇప్పుడు కాకినాడు వెళ్లాడు. రైతుసౌభాగ్య పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టాడు. ఆ దీక్షా సభలో మాట్లాడుతూ ‘త్వరలో మాకూ ఒకరోజు వస్తుంది. ఆ రోజున మీరు భస్మీపటలమవుతారు’ అని జగన్ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించాడు. ఆ ఒక్క రోజూ రాకూడదని ప్రార్థించాలని వైసీపీ నేతలకు హితవు పలికాడు. పవన్‌కు ఒకరోజు రావడమంటే బీజేపీలో విలీనం చేయడం ద్వారా తానూ దేశాన్ని పాలిస్తున్న పార్టీ నేత కావడమేనా?
ఇంతకు మించి ఆయనకు వచ్చే మంచిరోజులు ఏమున్నాయి. పైన పేర్కొన్నట్టు వివిధ సందర్భాల్లో బీజేపీతో తన సత్సం బంధాల గురించి పవన్ చెబుతుండడాన్ని బట్టి ఆయన త్వరలో బీజేపీతో ఒక ఒప్పందానికి సిద్ధమవుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. కాబోయే అధికార పార్టీ నేతగా …ఇప్పటి నుంచే ఆయన జగన్ సర్కార్‌ను హెచ్చరించడం గమనార్హం. మొత్తానికి ఒక్కో వేదిక మీద నుంచి తన రాజకీయ భవిష్యత్ గురించి డైరెక్ట్‌గా లేదా ఇన్‌డైరెక్ట్‌గా జనానికి ఆయన స్పష్టత ఇస్తున్నాడు