ఓవైపు తనకు రాజకీయాలే ముఖ్యం అంటాడు, సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశం ఇప్పట్లో లేదంటూ ప్రకటనలు ఇస్తుంటాడు.మరోవైపు పవన్ హీరోగా ఏకంగా సినిమా ప్రారంభమైంది.మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికైనా పవన్ తన రీఎంట్రీపై ఓ ప్రకటన చేస్తే బాగుంటుంది. మళ్లీ సినిమాలు చేసే విషయంపై బయటపడితే బెటర్.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ లో పవన్ నటిస్తారంటూ కొన్ని రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టే పూజా కార్యక్రమాలతో ఆ సినిమా మొదలైంది. మ్యూజిక్ డైరక్టర్ తమన్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. సినిమా మొదలైన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన యూనిట్.. ఎక్కడా పవన్ పేరును ప్రస్తావించకపోవడం.
ఈ విషయంలో ఇటు యూనిట్ తో పాటు అటు జనసైనికులు ఓ పద్ధతి ప్రకారం వ్యవహరిస్తున్నారనే విషయం అర్థమౌతూనే ఉంది. దిల్ రాజు, తమన్ ఎవరూ తన ట్వీట్లలో పవన్ పేరు ప్రస్తావించలేదు. అటు జనసైనికులు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో సైలెంట్ గా ఉన్నారు. చిన్న అంశానికే ట్వీట్లతో హోరెత్తించే జనసైనికులు.. పవన్ రీఎంట్రీ మూవీ ప్రారంభమైతే ఊరుకుంటారా? కానీ పింక్ రీమేక్ విషయంలో అంతా తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నారు.
ఓవైపు రాజకీయాలు మాత్రమే చేస్తానంటున్న పవన్, ఈ సినిమా ఓపెనింగ్ పై మాత్రం గుంభనంగా ఉన్నాడు. ఫ్యాన్స్ ను కూడా ఈ సినిమా ప్రస్తావన తీసుకురావొద్దని ఆదేశించాడు. అందుకే అంతా, పక్కా ప్లాన్ ప్రకారం సైలెంట్ గా జరుగుతోంది. సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి, త్వరలోనే పవన్ తన రీఎంట్రీపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇప్పటికిప్పుడు సినిమాల్లో రీఎంట్రీపై ప్రకటన చేస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేనాని భయపడుతున్నారు. వైఎస్ జగన్ పాలన బాగుంటే, తను ఎంచక్కా మళ్లీ సినిమాలు చేసుకుంటానని పవన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే