సినిమా రివ్యూ: వెంకీ మామ

సమీక్ష: వెంకీ మామ రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి., పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ తారాగణం: వెంకటేష్‌, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, నాజర్‌, రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌, దాసరి…

సమీక్ష: వెంకీ మామ
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి., పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ
తారాగణం: వెంకటేష్‌, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, నాజర్‌, రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌, దాసరి అరుణ్‌ కుమార్‌ తదితరులు
మాటలు: శ్రీకాంత్‌ విస్సా
సంగీతం: తమన్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ళ
నిర్మాతలు: సురేష్‌, టి.జి. విశ్వప్రసాద్‌
కథ, కథనం, దర్శకత్వం: కె.ఎస్‌. బాబీ
విడుదల తేదీ: డిసెంబర్‌ 13, 2019

నిజ జీవితంలో మేనమామ-మేనల్లుడు అయిన వెంకటేష్‌, చైతన్య తెరపై కూడా అదే సంబంధంతో కనిపించారు. 'వెంకీ మామ' గురించి చెప్పుకోడానికి అంటూ ఏదైనా వుంటే ఆ పాయింట్‌ ఇదే. ఈ అరుదైన కలయికలో సినిమా రూపొందింది అంటే ఖచ్చితంగా దానికో పకడ్బందీ కథ, రసవత్తరమైన కథనం వుంటాయని ఆశిస్తారెవరైనా. కానీ వీరిద్దరినీ ఫిట్‌ చేసేలా కథ రెడీ చేస్తే, ఆ పాత్రలు ఆయా హీరోల వయసుకి తగ్గట్టు తీర్చిదిద్దితే ఎలాగుంటుందనే బేసిక్‌ ఐడియాతో రాసుకున్నట్టుంది 'వెంకీమామ'.

పసితనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న మేనల్లుడిని తండ్రిలా పెంచుతాడు మేనమామ. తన పెళ్లిని కూడా త్యాగం చేసేసి మేనల్లుడికే సమయం అంతా కేటాయించేస్తాడు. కానీ వీరిద్దరినీ విడదీయడానికి విధి ఒక పకడ్బందీ స్కీమ్‌ వేసుకుని కూర్చుంటుంది. మేనల్లుడి జాతక రీత్యా మేనమామకి ప్రాణగండం కనుక ఇద్దరూ విడిపోక తప్పని పరిస్థితి.

ఈ ఫ్యామిలీ డ్రామాలో పెళ్లీడుకొచ్చిన మేనల్లుడు తన మేనమామకి పెళ్లి కాకపోవడానికి తానే కారణమని తెలిసి అతనికి ఒక హిందీ టీచర్‌ని 'సెట్‌' చేయాలని ఫిక్స్‌ అవుతాడు. మరోవైపు మేనల్లుడికి తన గాళ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయిందని తెలిసి వాళ్లిద్దరినీ కలపడానికి వెంకీమామ ట్రై చేస్తుంటాడు. కామెడీ చేసుకోవడానికి ఈ సన్నివేశాలు ఇలా పనికొస్తే, పాటలు పాడుకోవడానికి ఇద్దరు హీరోయిన్లు అలా కుదిరిపోతే, ఫైట్లు చేసుకోవడానికి విలేజ్‌ పాలిటిక్స్‌ చేసేవాళ్లు ఎలాగో వుంటారు.

వెంకీమామకి జోడీని వెతుకుతూ ఇదే అమ్మాయి మావయ్యకి ఇరవయ్యేళ్ల క్రితం కనిపించినట్టయితే… అంటూ చైతన్య ఒక 'రెట్రో' సాంగ్‌ ఊహించుకుంటాడు. నిజానికి ఈ కథే ఇరవయ్యేళ్ల క్రితం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ముత్యాల సుబ్బయ్య మార్కు రూరల్‌ డ్రామా అయిన ఈ చిత్రాన్ని ఈ తరం ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకోవాల్సిన పనే లేదన్నట్టు, మాస్‌ ప్రేక్షకులకి ఇంత కంటే ఏమి కావాలన్నట్టుగా కాస్తయినా కొత్తదనం చూపించాలనే ప్రయత్నం కూడా చేసినట్టనిపించదు.

కామెడీ పేరిట చేసేదంతా ద్వందార్థాలతో కాస్త అభిరుచి వున్న ప్రేక్షకులు నొచ్చుకునేలా, పిల్లలని ఈ మామకి దూరంగా వుంచాలనిపించేలా అనిపిస్తుంది. కనీసం పాత్రలయినా ఈ తరాన్ని రిప్రజెంట్‌ చేస్తాయా అంటే అదీ లేదు. హీరోయిన్లని చూపించే తీరులోనే ఇంకా ఎంత బ్యాక్‌వార్డ్‌గా ఆలోచిస్తున్నారనేది తెలుస్తుంది. వెంకటేష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, ఆయన మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వల్ల కొన్ని రెగ్యులర్‌ సీన్లు కూడా పాస్‌ అయిపోయాయి కానీ తను కూడా లేకపోతే ఈ సినిమా ఈమాత్రమయినా స్కోర్‌ చేసి వుండేది కాదు. వెంకటేష్‌కి ఒక పాత్ర చిత్రణ రాసుకున్న దర్శకుడు మరో హీరోని పెట్టుకున్నపుడు తనకంటూ ఒక క్యారెక్టర్‌ ఆర్క్‌ వుండాలని అనుకోకపోవడం విడ్డూరమనిపిస్తుంది. ఒక్కోసారి మరీ హీరో వెనుక సహాయ పాత్ర చేస్తున్నాడనిపించేలా చైతన్య కనిపిస్తుంటాడు. ఇద్దరు హీరోల సినిమాలో కథని డ్రైవ్‌ చేసేది ఏ క్యారెక్టర్‌ అయినా కానీ మరో పాత్రకి కూడా తగిన క్యారెక్టరైజేషన్‌ వుండాలనే బేసిక్‌ పాయింట్‌ విస్మరించడాన్ని ఏమనుకోవాలో ఏమో.

కనీసం మామ అల్లుళ్ల అనుబంధం ఎలివేట్‌ అయ్యేలా బలమైన సన్నివేశాలు కూడా ఏమీ లేవు. ఎంతసేపు 'నాకు అల్లుడంటే ఇష్టం' అని మామ, 'నాకు మావయ్యంటే ఇష్టం' అని అల్లుడు చెప్పుకోవడం తప్ప వారి అనుబంధం ఎంత గాఢమైనదనేది రిజిష్టర్‌ అయ్యే ఎమోషనల్‌ సీన్సే లేవు. పోనీ జాతక ప్రభావం అంటూ పెట్టిన 'గండం' తాలూకు సంఘటనలయినా ఎఫెక్టివ్‌గా వున్నాయా అంటే అదీ లేదు. ఈ కథని ఏమాత్రం థాట్‌ పెట్టకుండా ఎంత 'బేసిక్‌'గా రాసేసుకున్నారనే దానికి సదరు గండాల సన్నివేశాలే ఉదాహరణ. ప్రథమార్ధంలో ఏమీ లేకపోయినా కానీ స్క్రీన్‌ కాస్త కలర్‌ఫుల్‌గా వుంటుంది. కానీ 'కోకోకోలా పెప్సీ' పాట తర్వాత ఆ లైవ్‌లీ అట్మాస్ఫియర్‌ కూడా పోయి, ఈ కథలో ఏమాత్రం ఇమడని కాష్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో చాలా పేలవంగా తీసిన సర్జికల్‌ స్ట్రయిక్‌ సీన్లు వగైరా వచ్చి పడతాయి. అంతవరకు వెంకటేష్‌ ఏదో రకంగా ఈ వెంకీ మామని మోసినా కానీ ఇక ఆ సన్నివేశాల నుంచి ఆయన వల్ల కూడా కాలేనంతగా వెంకీ మామ గ్రాఫ్‌ పడిపోతుంది.

వెంకటేష్‌ తనదైన శైలిలో వెంకీ మామ పాత్రలో అలరించగా, చైతన్య సపోర్టింగ్‌ రోల్‌లో ఇమిడిపోయాడు. హీరోయిన్లని సోకాల్డ్‌ 'మాస్‌ కామెడీ' కోసం, రెండు మసాలా పాటల కోసం మాత్రం వాడుకున్నారు. 'దీన్నే ఇంగ్లీష్‌లో ఇలా అంటారు' అనే మేనరిజమ్‌ డైలాగ్‌తో రావు రమేష్‌ పాత్ర మొదట్లో కాస్త ఆసక్తికరంగా అనిపించినా కానీ ఆ పాత్రని ఎస్టాబ్లిష్‌ చేయలేదు. దాసరి అరుణ్‌కి చాలా కాలం తర్వాత వచ్చిన మంచి అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేదు.

తమన్‌ స్వరపరిచిన పాటల్లో వెంకీ మామ, కోకోకోలా పాటలు హుషారుగా వున్నాయి. నేపథ్య సంగీతం పరంగా తనదైన పనితనం చూపించే స్కోప్‌ ఇచ్చే సన్నివేశాలేమీ లేవు. ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ పరంగా అసలు రాజీ పడలేదు. ఖర్చుకి నిర్మాతలు వెనకాడలేదు కానీ దర్శకుడే ఆ ఖర్చుని సవ్యంగా వినియోగించుకోలేదు. బాబీకి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ పట్ల ఆసక్తి ఎక్కువే కావచ్చు కానీ మరీ ఇలా నాసి రకం సన్నివేశాలతో, ఇరవయ్యేళ్ల నాటి పద్ధతుల్లో కథని నెరేట్‌ చేయడం, సన్నివేశాలని తీర్చిదిద్దడం సబబు అనిపించదు. ఎంత మాస్‌ ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ ఫ్రెష్‌ అప్పీల్‌ కోసం ప్రయత్న లోపం అయితే జరిగి వుండకూడదు.

ఓవరాల్‌గా వెంకీ మామ కేవలం కాంబినేషన్‌ క్రేజ్‌ మీద, వెంకటేష్‌ ఇమేజ్‌ మీద డిపెండ్‌ అయిన చాలా రెగ్యులర్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. 'మీడియోకర్‌' అంటారు దీన్నే ఇంగ్లీష్‌లో!

బాటమ్‌ లైన్‌: అవుట్‌డేటెడ్‌ డ్రామా!

గణేష్‌ రావూరి