భీమ్లా నాయక్ లో బ్రహ్మానందం… అనే వార్త అయ్యప్పనుమ్ కోషీయుం సినిమాను వీక్షించిన వారికి, ఆ సినిమాను ఇష్టపడే వారికి ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, మరి కాస్త విస్తుగొలుపుతూ ఉంది కూడా!
ఇక్కడేదో బ్రహ్మానందం అంటే నచ్చకో, ఆయన నటనంటే నచ్చకో కాదు.. ఇంతకీ ఆ సినిమాలో బ్రహ్మానందం పాత్రకు స్పేస్ ఎక్కడుందని! అయితే మలయాళీ సినిమా రీమేక్ విషయంలో స్పేస్ లేకపోయినా.. చాలా వాటికి క్రియేట్ చేసుకుంటూ ఉన్నారని స్పష్టం అవుతోంది.
ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కల్యాణ్, నిత్యామేనన్ ల మధ్యన డ్యూయెట్ కే స్పేస్ ను క్రియేట్ చేసుకున్న వారికి, బ్రహ్మానందం పాత్రకు స్పేస్ ను క్రియేట్ చేయడం పెద్ద కథేమీ కాదు. సినిమా టైటిల్ దగ్గర నుంచినే మొత్తం ఫ్లేవర్ ను మార్చేశారు తెలుగులో.
ఇద్దరు ప్రధాన పాత్రధారుల సినిమా పేర్లతో పెట్టిన మలయాళీ టైటిల్ ను ఏకపాత్రాభినయం తరహాలో మార్చేసిన వైనం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది.
ఇక డీగ్లామరస్ పాత్రలకు విపరీతమైన మేకప్, మాజీ నక్సల్ పాత్రకు ఫ్యాన్సీ చీర కట్టిన వైనం.. ఈ సినిమా రీమేక్ కు సంబంధించి ఇప్పటికే విడుదలైన సమాచారం లోని మెరికలు. ఇవే అనుకుంటే.. డ్యూయెట్లు, ఇప్పుడు కామెడీ కూడా! వాస్తవానికి అయ్యప్పన్ సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది.
ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా.. ప్రధాన పాత్రల మాటల విరుపులోనే హ్యూమర్ పండుతుంది. మలయాళం అర్థం కాకపోయినా.. సబ్ టైటిళ్లతో కూడా ఆ వ్యంగ్యాన్ని, ఆ విరుపును అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి హ్యూమర్ రీమేక్ లో ఏ మేరకు పండుతుందో కానీ… ఇప్పుడు కామెడీ ని కూడా జోడిస్తున్నట్టుగా ఉన్నారు.
మరి స్పేస్ లేని చోట స్పేస్ ను క్రియేట్ చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. మరి అంతిమంగా ఈ వంట ఎలా తయారవుతుందో!