‘ఎంట్రీ & ఎగ్జిట్’.. మద్దతు అంటే ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండేలానే డిమాండ్ తో మహాపాదయాత్ర జరుగుతోంది. ఇది రైతుల పాదయాత్ర అని, వాళ్లు రైతులు కాదు కార్యకర్తలని.. ఇలా రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి. అదంతా పక్కన పెడితే.. యాత్ర…

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండేలానే డిమాండ్ తో మహాపాదయాత్ర జరుగుతోంది. ఇది రైతుల పాదయాత్ర అని, వాళ్లు రైతులు కాదు కార్యకర్తలని.. ఇలా రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి. అదంతా పక్కన పెడితే.. యాత్ర చివరి అంకానికి చేరుకుంది. 

నెల్లూరు జిల్లా దాటి చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టింది. యాత్ర ప్రారంభం అయిన నాటినుంచి.. ఈ మహాపాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పడుతున్నట్టు.. అఖండమైన మద్దతు వెల్లువెత్తుతున్నట్టు మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. అయితే వాస్తవం కొంత భిన్నంగానే ఉంది.

జనం సంగతి ఏమో గానీ.. పార్టీల వాళ్లు వస్తున్న మాట మాత్రం నిజం. అయితే వారి రాకను, నడకను మద్దతు కింద పరిగణించి మురిసిపోవచ్చునో లేదో అర్థం కావడం లేదు.

మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి అన్ని పార్టీల నాయకులూ తరలివచ్చారు. కానీ.. నాయకులు రావడం యాత్రకు మద్దతు ఇవ్వడం అనేది పూర్తిగా కామెడీ వ్యవహారం లాగా సాగిపోతోంది. 

తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం అన్ని పార్టీలకు చెందిన నాయకులూ గ్రూపులు గ్రూపులుగా వస్తారు. ఒక్కో గ్రూపు చేతిలో ఓ ఫ్లెక్సి ఉంటుంది. ఓ ఇద్దరు ఆ ఫ్లెక్సిని అటూ ఇటు పట్టుకుని నిల్చుంటారు. దాని వెనుక ఒకరిద్దరు నాయకులు నిలబడతారు. తమతో ఒకరిద్దరు పాదయాత్రికుల్ని నిల్చోబెట్టుకుంటారు. 

కొంచెం నినాదాలు చేస్తారు. కొంచెం దూరం నడుస్తారు. అంతే.. అక్కడితో ఆ షో అయిపోతుంది. ఆ బ్యాచ్ వెళ్లిపోతుంది. ఈలోగా బోలెడు ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. అప్పటికప్పుడు వాటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకుంటారు.

మరో పార్టీ బ్యానర్ తో మరో టీం వస్తుంది. మళ్లీ ఇదే ప్రహసనం రిపీట్ అవుతుంది. ఈ రకంగా.. అన్ని పార్టీలూ అమరావతి వారి పాదయాత్రకు మద్దతు ఇచ్చే పర్వాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే ముగిస్తారు.

నాటకాలు ప్రదర్శించడంలో ఒక నియమం ఉంటుంది. స్టేజ్ ఎంట్రీ, స్టేజ్ ఎగ్జిట్ అనేవి పద్ధతిగా ప్లాన్ చేసుకోవాలి. ఒక పాత్ర ఎలా రంగస్థలం మీదికి ప్రవేశించాలి.. ఎలా నిష్క్రమించాలి? అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. పాదయాత్రలో ఒక్కొక్క పార్టీ రావడమూ పోవడమూ కూడా ఇదే నాటకాల ప్రక్రియను తలపిస్తోంది. యాత్రకు మద్దతిస్తున్నాం అని చెప్పుకుంటున్న పార్టీల్లో చిత్తశుద్ధితో యాత్రలో పాల్గొంటున్న వారు ఎందరో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.  

మామూలుగానే.. ఈ యాత్రను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేస్తున్నదనే విమర్శలు తొలినుంచి ఉన్నాయి. స్థానికంగా యాత్రకు మద్దతు రూపంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటున్నాయి. ఆ ఒక్క పార్టీ మాత్రమే విరాళాల రూపంలో యాత్రకు ఏర్పాట్ల వ్యవహారం చూస్తోంది. వాళ్లయినా పార్టీ ఆదేశాల మేరకు తప్పదు గనుక ఆ పనులు చేస్తున్నారో.. నిజంగా యాత్రకు మద్దతుగా చేస్తున్నారో అర్థం కాని సంగతి.

వ్యవహారాలన్నీ ఇలా ఉండగా.. అమరావతి పాదయాత్రకు ప్రజల మద్దతు పార్టీల మద్దతు వెల్లువెత్తుతున్నదంటే ఎలా నమ్మడం? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.