రోశయ్యగారు వెళ్లిపోయాడు. చెయ్యెత్తు మనిషి. మంచి వాగ్ధాటి. మేధావి. హుందాగా వుంటూనే ప్రత్యర్థుల మొహం బద్దలయ్యేలా చెణుకులు విసరగల నేర్పు. రాజకీయ పరిజ్ఞానంతో బాటు పరిపాలనా దక్షత కూడా ఆయన సొత్తు. అతి ముఖ్యమైన ఆర్థికశాఖను ఆయన అవలీలగా నిర్వహించగలిగాడు. తనకంటూ ప్రత్యేక వర్గమేమీ ఏర్పరచుకోకుండానే, ఏ లాబీయింగు చేసుకోకుండానే దశాబ్దాల తరబడి మంత్రిగా వుండగలిగాడంటే అది ఆయన ప్రతిభకు నిదర్శనం. ముఖ్యమంత్రిగా, గవర్నరుగా కూడా చేసి, హాయిగా రిటైరయిపోయి, సునాయాసంగా ప్రాణాలు విడిచారు. అనేకమంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేసినా వైయస్ హయాంలో ఆయన ఒక వెలుగు వెలిగారు. ఈయన వైయస్‌ను ఆత్మీయంగా చూస్తూ, ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తిగానే వున్నారు తప్ప ఆ పదవి ఆశించలేదు. వైయస్ ఆయన్ను ఒక మార్గదర్శకుడిగా, ఒక అన్నగారిగా చూశారు.
వైయస్‌కు చీఫ్ పిఆర్ఓగా పనిచేసిన జి.వల్లీశ్వర్ గారు ‘‘వైయస్సార్ ఛాయలో…’’ అనే పుస్తకంలో రాశారు – 2005లో ఆయన కూతురు పెళ్లి రిసెప్షన్‌కు వైయస్, కెవిపి, రోశయ్య వచ్చారట. వాళ్లు వేదిక ఎక్కబోతూండగా వల్లీశ్వర్ వైయస్‌తో ‘సర్, రోశయ్య గారు వయస్సులో మీకన్నా పెద్దవారు కదా, ముందుగా వారు పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగుంటుందేమో..’ అన్నారు. వైయస్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘అవును కదా! రోశయ్యగారూ, మీరు ముందు పదండి.’ అన్నారు. ముఖ్యమంత్రిని నన్ను వెనక్కి నెట్టేస్తారేమిటి అనుకోలేదు. అదీ ఆయన పొందిన గౌరవం!
రోశయ్యగారి మృతి తర్వాత టీవీలు, పత్రికలు చాలా విశేషాలు చూపారు, రాశారు. అవన్నీ ఎత్తి రాయడం అనవసరం. ఆయనలో మెచ్చుకోదగిన గుణాలెన్ని వున్నా నా మట్టుకు నాకు ఆయనలో రెండు దోషాలు కనబడ్డాయి. ఒకటి రెడ్డి కాంగ్రెసు నుంచి ఇందిరా కాంగ్రెసులోకి దూకడం, రెండు ముఖ్యమంత్రి పదవిలో వుండగా ఆత్మాభిమానం చంపుకుని, పార్టీ అధిష్టానం చెప్పినట్లు ఆడడం! 1977లో ఎమర్జన్సీ ఎత్తివేసి ఇందిరా గాంధీ ఎన్నికలు పెడితే ఉత్తరాదిన ఘోరంగా ఓడిపోయి, జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇందిర పని అయిపోయిందనుకుని కాంగ్రెసు ఆవిడను బహిష్కరించింది. ఆవిడ బయటకు వెళ్లి కాంగ్రెసు (ఐ) అని పెట్టుకుంది. బ్రహ్మానంద రెడ్డిగారి అధ్యక్షతన మిగిలిన కాంగ్రెసును కాంగ్రెసు (ఆర్) అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వున్న వెంగళరావు కాంగ్రెసు (ఆర్)తో ఉన్నారు.
1978లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి కాంగ్రెసు- ఐలోకి చెన్నారెడ్డి తప్ప వేరే ఏ నాయకుడూ చేరలేదు. దాంతో అనామకులకు కూడా టిక్కెట్టిచ్చారు. జనతా పార్టీ, కాంగ్రెసు-ఆర్, కాంగ్రెసు-ఐల త్రిముఖ పోటీలో 294 సీట్లలో కాంగ్రెసు-ఐకు 175, జనతా పార్టీకి 60, కాంగ్రెసు-ఆర్కు 30, లెఫ్ట్ పార్టీలకు 14 రాగా 15 మంది స్వతంత్రులు నెగ్గారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి, నియంతలా పాలించసాగారు. ఆయన పాలనలో సమర్థత, అవినీతి రెండూ పెనవేసుకుని ఉన్నాయంటారు. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అంతఃకలహాల్లో మునిగిపోయింది. రెండేళ్లు పోయేసరికి పార్టీ చీలిపోయింది కూడా. దానితో రాష్ట్రంలో జనతా పార్టీ నిలదొక్కులేక పోయింది. కాంగ్రెసు-ఐ ఆంధ్రతో పాటు కర్ణాటకలో అసెంబ్లీ గెలవడం, చిక్‌మగళూరు పార్లమెంటు స్థానం ఉపయెన్నికలో 1978లో ఇందిర గెలిచి, ప్రజలు తన వెంటే ఉన్నారని నిరూపించుకోవడంతో కాంగ్రెసు-ఆర్ స్థయిర్యం కూడా సన్నగిల్లింది.
ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీల వాళ్లు కాంగ్రెసు-ఐలో చేరిపోయారు. చెన్నారెడ్డికి ఎదురు లేకుండా పోయింది. ఆయనంటే భయపడి, ఎవరూ నోరెత్తేవారు కారు. కానీ శాసనమండలిలో కాంగ్రెసు-ఆర్ తరఫున రోశయ్య, అసెంబ్లీలో జనతా పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే చేకూరి కాశయ్య చెన్నారెడ్డిని చీల్చి చెండాడేవారు. ఆయన అవినీతిని ప్రశ్నించేవారు. సాధారణ జనాల దృష్టిలో వాళ్లు హీరోలుగా వుండేవారు. ఇలా వుండగా 1978లోనే రోశయ్య హఠాత్తుగా పార్టీ ఫిరాయించేశారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖకు మంత్రి అయిపోయారు. ‘ఈయన కూడా యింతేనా?’ అనిపించింది జనాలకు.
ఆనాటి దిగ్భ్రమ గురించి సీనియర్ జర్నలిస్టు భోగాది వేంకట రాయుడు తన ఆత్మకథ ‘‘రాస్తూనే ఉందాం’’లో రాశారు. శాసనమండలిలో రోశయ్యగారు చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని బండకేసి, ఉతికి ఆరేస్తుంటే, ఆయన మాటల ప్రవాహానికి చెన్నారెడ్డిగారికి చెమటలు పడుతూంటే ఆయన వంటి జర్నలిస్టులకు రోశయ్యంటే హీరో వర్షిప్ ఉండేది. మంత్రిపదవి అనే ఎరను వేసి రోశయ్యగారిని చెన్నారెడ్డి లాగేయడంతో, అప్పటిదాకా ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన నోటితోనే, ఆ ప్రభుత్వాన్ని సమర్థించడం ప్రారంభించడం చూసి రాయుడులాటివాళ్లకు నోటిమాట రాలేదు. ఏలూరులో రోశయ్య గారికి సన్మానం జరిగితే ‘ఆంధ్రజ్యోతి’ తరఫున రాయుడూ, ‘ఈనాడు’ తరఫున వల్లీశ్వర్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి ఆయన్ను కలిశారు.
‘మండలిలో అంత తీవ్రంగా విమర్శించిన మీరు, మంత్రివర్గంలో ఎలా చేరారా అని…’ అని రాయుడు అడిగితే రోశయ్య ‘ప్రతిపక్షంలో ఉండి చేసింది, నెగటివ్ పాలిటిక్స్. అయితే రాష్ట్రానికి నా కంట్రిబ్యూషన్ ఏముంటుంది? అదే ప్రభుత్వంలో ఉంటే, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించవచ్చు. ఇది పాజిటివ్ పాలిటిక్స్.’ అన్నారు. అప్పుడు వల్లీశ్వర్ ‘చెన్నారెడ్డి ప్రభుత్వ నిజాయితీపై మీ అభిప్రాయం ఏమిటి..?’ అని అడిగారు. రోశయ్య వీళ్లిద్దరికేసి తేరిపార చూసి, పెద్దగా నవ్వేసి, ‘మళ్లీ కలుద్దాం..’ అంటూ లేచారు. మర్నాడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో మొదటి పేజీలో వార్త ‘చెన్నారెడ్డి ప్రభుత్వ నిజాయితీపై రోశయ్య మౌనం’ అనేది హెడ్డింగ్. అది చూస్తూనే రోశయ్య రాయుడి యింటికి ఫోన్ చేసి, ‘ఏమిటా రాతలు, మీ పేపర్లో’ అన్నారు కోపంగా. ‘తప్పు ఏమీ రాయలేదు సర్.’ అన్నాడీయన.
‘తప్పు రాశావని ఎవరన్నారు? మీ నాన్నగారున్నారా అని నేనన్నాను. నీ యమ్మా మొగుడున్నాడా అని నేను అన్నట్టు రాశావు. రెండూ ఒకటే. అర్థంలో ఎంత తేడా వుంది?’ అంటూ కోపంతో ఆయాసపడ్డారు,
‘అవేం వంకర రాతలయ్యా? చెన్నారెడ్డి మీ రెండు పేపర్లూ చూసి, ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు. నేను ఏమీ కామెంట్ చెయ్యలేదు అని సర్దిచెప్పేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది’ అని యింకా చెప్పబోతూండగా ‘మీరేమీ చెప్పలేదనే మేమూ రాసింది సర్’ అంటూ రాయుడు చెప్పబోతూంటే రోశయ్యగారికి పిచ్చి కోపం వచ్చి ట్టప్ మని లైన్ కట్ చేశారు. రాజకీయ అవకాశవాదాన్ని సమర్థించుకోవడం ఎవరికైనా కష్టమే కదా!
ఇక రెండో అంశానికి వస్తే – చాలాకాలం తర్వాత రోశయ్యగారికి అనుకోని రీతిలో, వైయస్ అనూహ్య మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కింది. అప్పటిదాకా వెలిగిపోతున్న ఆయన వన్నె హఠాత్తుగా తగ్గిపోయింది. ఎందుకంటే వైయస్ వంటి మాస్, డైనమిక్ లీడరుకి వారసుడు కావడం మాటలు కాదు. వైయస్‌లో మంచీ, చెడూ రెండూ వున్నాయి. మంచి అస్సలు లేదని నమ్మేవాళ్లు యిటీవల టిడిపి నాయకులు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్తున్న, రాస్తున్న రాతలు చూడాలి. జగన్‌ను తిట్టడానికి వాళ్లు వైయస్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. డిసెంబరు 5 నాటి కొత్తపలుకులో ‘..నీటి పారుదల ప్రాజెక్టుల పేరు చెప్పగానే రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారు’ అని రాశారు. ప్రత్యర్థులను సైతం ఎంత గౌరవించేవారో, శత్రువైనా సరే, సహాయం అర్థిస్తే ఎలా చేసేవారో, ఎంత హుందాగా వుండేవారో, సంక్షేమ పథకాలు నడుపుతూ కూడా ఎంతటి ఆర్థిక క్రమశిక్షణతో వుండేవారో కథలుకథలుగా చెప్తున్నారు.
ఎన్నికలలో విజయం సాధించిన కొద్ది నెలలలోనే వైయస్ హఠాత్ దుర్మరణంతో తెలుగు ప్రజలందరూ నిర్ఘాంత పోయారు. ఉండవల్లి చెప్పినట్లు బతికున్న వైయస్ యిమేజి కంటె చచ్చిపోయిన వైయస్ యిమేజి అనేక రెట్లు ఎక్కువ. ఆయన స్థానాన్ని భర్తీ చేయాలంటే ఎవరున్నారు? అనే ప్రశ్న చావు వార్త బయటకు వచ్చిన దగ్గర్నుంచి మొదలైంది. సహజంగా అందరి దృష్టి కొడుకు మీద పడింది. అతనికి అనుభవం వుందా లేదా? పదవీబాధ్యతలు నిర్వర్తించగలడా లేదా అనే ప్రశ్న ప్రజల్లో రాలేదు. ఎందుకంటే భారత రాజకీయాల్లో సింపతీ ఫ్యాక్టర్ విపరీతంగా వర్కవుట్ అవుతుంది. ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణించగానే అతని స్థానంలో అతని భార్యను నిలబెట్టేస్తున్నారు. అప్పటిదాకా ఆమె సాధారణ గృహిణే కావచ్చు, ఇంటికి వచ్చినవాళ్లకు కాఫీ, టీలు అందాయో లేదో చూడడం తప్ప భర్త రాజకీయాల గురించి ఏ అవగాహనా లేకపోవచ్చు. అయినా ఆవిడకు అభ్యర్థిగా పార్టీ టిక్కెట్టివ్వడం, ప్రజలు పొలోమని ఓటేయడం జరుగుతోంది.
ఇలాటి వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెసుది అగ్రస్థానం. అసలు వాళ్లే యితరులకు నేర్పారు.అయితే జగన్ విషయంలో అధిష్టానం యింకోలా తలచింది. వైయస్‌పై ఉన్న సానుభూతి యితనికి చేరి, తండ్రిలాగే ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఎదుగుతాడని భయపడింది. అధిష్టానానికి ఎప్పుడూ తన మాట వినేవాళ్లే కావాలి. వాళ్లకు జనాల్లో పాప్యులారిటీ ఎంత తక్కువ వుంటే అంత మంచిదని వాళ్ల భావన. ఆ ధోరణి యిప్పటికి కూడా కొనసాగుతోంది కాబట్టే కాంగ్రెసు పాలిత రాష్ట్రాలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. లేటెస్టు ఉదాహరణ అమరీందర్‌ను బయటకు పంపడం. సొంతబలం వుంది కాబట్టే వైయస్ అప్పుడప్పుడు అధిష్టానానికి తల వొగ్గేవారు కారు. ఇప్పుడాయన పోయాడు కాబట్టి జీహుజూర్ అనే వాళ్లను పెట్టుకోవాలి. జగన్ అలాటివాడని తోచలేదు. అందువలన రోశయ్యగారిని ఎంచుకున్నారు. అక్కడే కాంగ్రెసు పెద్ద తప్పు చేసింది.
అప్పటికి తెలంగాణ అంశం సజీవంగా వుంది. వైయస్ కాబట్టి తెరాసతో గేమ్స్ అడుతూ దాన్ని అదుపులో వుంచగలిగాడు. వైయస్ పోయాడు కాబట్టి తెలంగాణలో పాప్యులర్ వ్యక్తి నెవరినైనా సిఎం చేసి వుంటే విభజనోద్యమం బలహీన పడేది. చిత్రమేమిటంటే, కాంగ్రెసు చివరిదాకా ఆ స్ట్రాటజీ అవలంబించలేదు. సిఎం పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఆంధ్రులకే కట్టబెడుతూ వచ్చి, ఆ విధంగా ఉద్యమకారుల ఫిర్యాదులకు ఊతాన్నిచ్చింది. సరే, ఆంధ్రవాళ్లనే సిఎం చేద్దామనుకుంటే తర్వాత తెచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని ముందుగానే తెచ్చి, రోశయ్యను ఆర్థికమంత్రిగా కొనసాగించి వుండాల్సింది. వాళ్లు ఏ ఉద్దేశంతో కిరణ్‌ను తెచ్చారో కానీ, అతను వస్తూనే ఓ పక్క జగన్‌ను, మరో పక్క తెలంగాణ ఉద్యమాన్ని అదుపు చేయగలిగాడు. విభజన పట్ల ఒక గట్టి స్టాండ్ తీసుకున్నాడు. బంద్‌లు అవీ నివారించి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం లేకుండా చూశాడు. ఇవి రోశయ్య వలన కాలేదు.
అధిష్టానం ఏ కారణం చేతనో రోశయ్యగారిని సిఎం చేసింది. సింహావలోకనం చేసి చూస్తే ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. హీ వజ్ ఏ రైట్ మ్యాన్ ఎట్ ద రాంగ్ ప్లేస్. మంత్రి మంత్రిగానే వుండాలి, రాజు రాజుగానే వుండాలి. మంత్రికి బుద్ధిబలం వుంటుంది కానీ సింహాసనం అధిష్టించలేడు, కఠిన నిర్ణయాలు తీసుకోలేడు. రాజుకి ఉండేది, ఉండవలసినది సాహసం, రిస్కు తీసుకునే ధైర్యం. డబ్బున్న కులాలు అనేకం వున్నా, రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కులాలు మాత్రమే చురుగ్గా వుంటాయెందుకు? వాళ్లకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, ఆట్టే మాట్లాడితే జూదరి మనస్తత్వం వుంటుంది కాబట్టి! చాలామంది మేధావులు దివ్యమైన సలహాలు యిస్తారు, కానీ తమకు తాముగా అమలు చేయడానికి జంకుతారు. ‘మేం చెప్పడం బట్టే మా ఫ్రెండు అక్కడ పది ఎకరాలు కొన్నాడు, యిప్పుడు పది కోట్ల ఆసామీ అయ్యాడు’ అని గొప్పలు చెప్తూ వుంటే మనం ‘అప్పుడే, అక్కడే మీరూ ఓ వెయ్యి గజాలు కొనలేక పోయారా?’ అని అడిగితే ‘అబ్బే, మనకెక్కడ కుదురుతుందండీ, నా డబ్బును బ్యాంకులో దాచుకున్నా’ అంటాడు. నో పెయిన్, నో గెయిన్!
రోశయ్యగారు ఆ పదవి ఆశించలేదు కానీ ఆమోదించారు కదా! ఆమోదించాక దానికి కావలసిన లక్షణాలన్నీ సంతరించుకోవాలి కదా! అబ్బే, ఆయన ఎప్పుడూ తన అథారిటీని ప్రదర్శించలేదు. ఎంతసేపూ ‘నేను స్టూలు మీద కూర్చున్నాను, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతాను’ అని పైకే చెపుతూండేవారు. అలా చెప్తే ఎవరు గౌరవిస్తారు? పివి చూడండి, అనుకోకుండా, ఆశించకుండా ప్రధాని అయ్యారు. అయ్యాక ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు! దీనివలన నా పదవి వున్నా, పోయినా ఫర్వాలేదు, దేశానికి మంచిదని నేనుకున్నది చేస్తున్నాను అని చేశారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎదుటి పార్టీలను చీల్చారు కూడా! రోశయ్య రాష్ట్రానికి ఏం మంచిదో అది చేయలేదు. అధిష్టానం ఏం చెపితే అదే చేశారు. వాళ్లకు కోపం రాకుండా చూసుకోవడానికే ఆయన టైమంతా సరిపోయింది.
ఒక ఐఏఎస్ అధికారికి ఎంత తెలివితేటలైనా వుండవచ్చు, గొప్పగా పాలించవచ్చు, మంచి సలహాలివ్వవచ్చు. కానీ అంతిమ నిర్ణయం తీసుకోవలసినది అధికారంలో వున్న రాజకీయనాయకుడు మాత్రమే. అందువలననే ఆ నిర్ణయం మంచిచెడ్డలన్నీ ఆ నాయకుడి ఖాతాలోనే పడతాయి. రోశయ్యగారు ఒక అధికారిలాగానే ప్రవర్తించారు తప్ప, ఒక పాలకుడిగా ప్రవర్తించలేదు. తను నిమిత్తమాత్రుణ్ని, అధిష్టానం ఎప్పుడు దిగిపోమంటే అప్పుడు దిగిపోవాలి, దానిలోనే తన క్షేమం వుంది అనుకున్నారు. ఇంత విధేయత చూపినందుకు అధిష్టానం ఏమైనా గౌరవం యిచ్చిందా? అబ్బే, 2009 డిసెంబరులో కెసియార్ నిరాహారదీక్ష మాన్పించడానికై తయారు చేసిన స్టేటుమెంటు నమూనా అంటూ రోశయ్యగారికి ఒకటి చూపించి, మరొకటి ! విడుదల చేశారు. ఈయన దిల్లీలో విమానం ఎక్కేటప్పుడు చూపించిన డ్రాఫ్టు ఒకటి, హైదరాబాదులో దిగాక వాళ్లు ప్రకటించినది వేరొకటి!
మామూలు మనిషి ఎవరైనా అయితే రోషం రావాలి. ‘42 మంది ఎంపీలున్న పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రికి యివ్వవలసిన గౌరవం యిదేనా? యూపిఏకు 33 మంది ఎంపీల నిచ్చి, యుపిఏ 2 ప్రభుత్వం ఏర్పడడానికి కారకమైన రాష్ట్రాన్ని పాలిస్తున్నవాణ్ని ఏ మాత్రం ఖాతరు చేయరా? పైగా యిది ఆషామాషీ నిర్ణయం కాదు, రాష్ట్రాన్ని ముక్కలు చేసే నిర్ణయం, తెలుగు జాతిని రెండుగా చీల్చే నిర్ణయం. ఏ పార్టీని సంప్రదించలేదు, ప్రజల మధ్య చర్చకు పెట్టలేదు, ఆ రోజు సోనియా గాంధీ తన బర్త్‌డే కేక్‌ను కోసినంత సునాయాసంగా, రాష్ట్రాన్ని కోసి ముక్కలు చేయడమేమిటి? దానివలన రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు ఎదురైతే ముఖ్యమంత్రిగా వాటిని హేండిల్ చేయవలసిన బాధ్యత నాది కదా! నేను ప్రిపేర్ కావాలంటే మీరు నన్ను విశ్వాసంలోకి తీసుకుని పాలనాపరంగా, రాజకీయపరంగా తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేయాలి కదా!’ అని రోశయ్య ఉద్రేక పడాలి.
నిజానికి 2009 డిసెంబరు 9 నాటి ప్రకటన ఎవరూ ఊహించనిది. కెసియార్ ఒక అంశంపై నిరాహారదీక్ష చేస్తే, కేంద్రం ఏకంగా రాష్ట్రాన్ని విభజించేస్తామంటూ ప్రకటన చేసింది. వెంటనే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిథులందరూ రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. దానికి ప్రతిగా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల వాళ్లూ ఏకం కావడం మొదలుపెట్టారు. సడన్‌గా కెసియార్ హీరో అయిపోయారు. ఒక ప్రాంతంలోని కొంతమందికి (అప్పటికి విభజన పట్ల తెలంగాణలో చాలామంది సానుకూలంగా లేరు) సోనియా దేవత అయిపోయింది. తక్కినవారందరికి దెయ్యం అయిపోయింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల సంబరాలు, మరి కొన్ని చోట్ల ఆందోళనలు, ప్రదర్శనలు. దాంతో 15 రోజులు తిరక్కుండా, యీ ప్రకటనను తిరగతోడుతూ మరొక ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇటువంటి పరిణామాలకు దారి తీసిన ఇంతటి ముఖ్యమైన నిర్ణయాన్ని తనకు తెలియకుండా, తనను సంప్రదించకుండా తీసుకున్నందుకు రోశయ్యగారు అభ్యంతరం తెలుపుతూ తన రాజీనామాను ప్రకటించినట్లయితే ఆయన హీరో అయివుండేవాడు.
ఆయన విభజనకు అనుకూలమా, ప్రతికూలమా అనేది యిక్కడ యిస్యూ కాదు. తన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన, వివాదాస్పదమైన అంశాన్ని తనతో సంప్రదించకుండా చేశారు అన్న పాయింటు మీదనే ఆయన ఫైట్ చేయాల్సి వుంది. చేస్తే ఏమయేది? పదవి పోయేది, అంతేగా! ఆయన ఆ పదవికి ఆశపడలేదు. తర్వాత తీసిపారేసినపుడు కిమ్మనకుండా దిగిపోయాడు కదా. పోనీ భయపడ్డాడు అనడానికి అవినీతి ఆరోపణలూ లేవు, కేసులూ లేవు. మరి ఎందుకు అంత ఆత్మగౌరవహీనంగా ప్రవర్తించడం? నాకు ఎప్పటికీ అర్థం కాదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)