cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సినీ అభిమానం.. త‌మిళ‌నాట‌, తెలుగునాట వేర్వేరుగా!

సినీ అభిమానం.. త‌మిళ‌నాట‌, తెలుగునాట వేర్వేరుగా!

ఈ మ‌ధ్య‌నే స‌ల్మాన్ ఖాన్ అభిమానులు.. ఆ హీరో సినిమా విడుద‌ల సంద‌ర్భంగా థియేట‌ర్లో ట‌పాసుల‌ను కాల్చారు. అదృష్ట‌వ‌శాత్తూ తీవ్ర‌మైన ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా లేదు అభిమానుల ఈ ఆక‌తాయి చేష్ట వ‌ల్ల‌! వెర్రిత‌ల‌లు వేసిన సినీ అభిమానంలోని చిన్న అంకం ఇది. ఈ అంశంపై స‌ద‌రు హీరో కూడా స్పందించాడు. 

ఇలాంటి చేష్ట‌లు వ‌ల‌ద‌న్నాడు. అలాగే త‌న క‌టౌట్ కు పాల‌తో అభిషేకం చేసిన వారి తీరును కూడా స‌ల్మాన్ ఖాన్ త‌ప్పు ప‌ట్టాడు. ఆ పాల‌తో ఆక‌లితో ఉన్న వారి దాహం తీర్చాల్సింద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల చ‌ర్య‌ను దాదాపు త‌ప్పుప‌ట్టాడు.

ఇక ఇటీవ‌లే త‌మిళ హీరో అజిత్ కుమార్ ఒక స్టేట్ మెంట్ జారీ చేశాడు. త‌న‌ను *త‌ల‌* అంటూ పిల‌వొద్దు అని మీడియాకూ, అభిమానుల‌కూ జాయింటుగా చెప్పాడు అజిత్ కుమార్. త‌న‌ను అజిత్ అని పిల‌వొచ్చ‌ని, లేదంటే అజిత్ కుమార్ అనాల‌ని, ఏకే అని పిలిచినా అభ్యంత‌రం లేద‌ని.. అంతే కానీ.. త‌న‌నో నాయ‌కుడిని చేసి త‌ల అంటూ పిల‌వొద్ద‌ని అజిత్ కుమార్ చెప్పాడు. 

త‌మిళ‌నాట క‌ల్ట్ ఫాలోయింగ్ ను క‌లిగిన అజిత్ ను అత‌డి అభిమానులు త‌ల అని పిలుచుకుంటూ ఉంటారు. అలా పిలుచుకోవ‌డంతో ఆగి ఉంటే ఫ‌ర్వాలేదు. అయితే ఒక హీరోపై అభిమానం మ‌రో సినిమా హీరోపై ద్వేషంగా మారి చాలాకాలం అయ్యింద‌క్క‌డ‌. ఫ్యాన్ వార్ ప‌తాక స్థాయిలో ఉంటుంది. 

ఆ మ‌ధ్య త‌న పేరిట అభిమాన‌సంఘాల‌ను ఏర్ప‌ర‌చ‌డానికి వీల్లేద‌ని అజిత్ స్ప‌ష్టం చేసిన‌ట్టుగా ఉన్నాడు. ఉన్న వాటన్నింటినీ ర‌ద్దు చేసిన‌ట్టుగా కూడా చెప్పాడు. త‌ల అనేది ఏదో సినిమాలో త‌న పాత్రకు ఉన్న ట్యాగ్ కావొచ్చు కానీ, త‌ను కాద‌ని అజిత్ స్ప‌ష్టం చేశాడు.

వెర్రిత‌ల‌లు వేసిన సినీ అభిమానం కొంత‌మంది హీరోల‌కు కూడా న‌చ్చ‌డం లేన‌ట్టుగా ఉంది. ఇక త‌న పేరిట రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించే వారిపై కోర్టుకు వెళ్తానంటూ మ‌రో త‌మిళ హీరో విజ‌య్ ప్ర‌క‌టించాడు. తాము సినిమాల‌కే ప‌రిమితం కాద‌లుచుకున్న‌ట్టుగా.. వేరే ట్యాగ్ లు, బిరుదులూ త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని త‌మిళ హీరోలు ఈ త‌ర‌హాలో క్లారిటీ ఇచ్చారు.

ఇక తెలుగునాట సినిమా హీరోల అభిమానుల పైత్యం త‌మిళానిక‌న్నా ఎక్కువ స్థాయిలో ఉంద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళంలో అభిమానంలో క‌నీసం కుల పైత్యం లేదు! అజిత్ కుమార్ ఎక్క‌డో తుళూ వాడు. అత‌డికేమీ త‌మిళ‌నాట కులం బేస్ లేదు.  అలాగే విజ‌య్ కు అభిమాన‌గ‌ణంలో కూడా కుల ర‌చ్చ లేదు. అదే తెలుగు విష‌యానికి వ‌స్తే.. హీరోల‌ను అభిమానించ‌డంలో ప్ర‌ధానంగా కులాభిమానమే ఎక్కువ డ్యామినేట్ చేస్తూ ఉంటుంది.

ప్ర‌త్యేకించి కులంతో కూడుకున్న ఈ సినీ అభిమానం గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో రోజురోజుకూ పెరుగుతోందే కానీ.. త‌ర‌గ‌డం లేదు కూడా. విదేశాల‌కూ వెళ్లినా, ఎక్క‌డెక్క‌డో సెటిలైనా ఈ కులం దానితో ముడిప‌డ్డ సినీ అభిమానం అనే మూలాన్ని తెంచుకోవ‌డానికి తెలుగు వాళ్లు పెద్ద‌గా ఇష్ట‌ప‌డటం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. గ‌త వారంలో విడుద‌లైన ఒక హీరో సినిమాను ఆయ‌న కుల‌స్తులు స‌మ‌ర్పించుకున్నార‌ట‌! 

ఒక్కోరు ఒక్కో షో మొత్తానికీ డ‌బ్బులు చెల్లించి.. ఆడించి త‌మ అభిమానాన్ని చాటుకున్నార‌ట‌. మ‌రి ఈ అభిమానం ఇంత వ‌ర‌కూ ప‌రిమితం అయినా ఫ‌ర్వాలేదు. అయితే ఇది ఆధిప‌త్య‌పోక‌డ‌గా, ఇత‌ర హీరోల‌నో, ఇత‌ర కులాల‌నో ద్వేషించే వ‌ర‌కూ వెళ్లడం దుర‌దృష్ట‌క‌రం. ఈ పోక‌డ‌ను తెలుగు హీరోలు కూడా వీలైనంత‌గా క్యాష్ చేసుకునే త‌త్వం ఎంత‌వ‌ర‌కూ ఉందో చెప్ప‌లేం. 

అయితే సినీ అభిమానాన్ని రాజ‌కీయంగా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం, త‌మ బ్ల‌డ్డూ బ్రీడు వేర‌ని చెప్పుకోవ‌డం మాత్రం వారు బ‌హిరంగంగా చేసుకునేదే! త‌మిళ‌నాట ఏమో హీరోలే అభిమానుల చేష్ట‌ల‌ను క‌ట్ట‌డి చేస్తుంటే, ఈ అభిమానం అంతా ఆ హీరో లేదా ఆ కుల ఆధిప‌త్యంగా భావించే పోక‌డ తెలుగునాట బ‌ల‌ప‌డుతోంది!

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు