బీజేపీ నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కె.కవిత విరుచుకుపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆమె ఓ సభలో మాట్లాడుతూ ప్రత్యర్థులకు చురకలు అంటించారు. అలాగే తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పుకొచ్చారు.
ఏడేళ్ల క్రితం ఎలాగున్నాం, ఇప్పుడు ఎట్లా వున్నామో చూడాలన్నారు. ఇప్పుడు అభివృద్ధి సూచిలో దేశంలోనే తెలంగాణ నంబర్ ఒన్ స్థానంలో ఉందన్నారు. మనం రాష్ట్రం తెచ్చుకోవడం కోసం ఎంత ప్రేమతో కొట్లాడుకున్నామో, రాష్ట్రం వచ్చిన తర్వాత అంతే ఆర్తితో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.
కేసీఆర్ మాటలు నమ్మి ఉద్యమంలో ఉండడం వల్లే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కొత్త రాష్ట్రంలో రెండుసార్లు కేసీఆర్ను దీవించి ముఖ్యమంత్రి చేసుకున్నారన్నారు. మీ సహాయ సహకారాలు, ఆశీర్వాదం టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయన్నారు. అభివృద్ధి చేసే వారికి మరింత మద్దతు ఇస్తే మంచిగా ఉంటుందన్నారు.
రాజకీయం కోసం అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారని వాపోయారు. కత్తి ఎవరి చేతికి ఇవ్వాలి, యుద్ధం ఎవరితో చేయాలో ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరారు. రాజకీయం కోసం ఎన్నైనా మాట్లాడొచ్చన్నారు. బీజేపీ వాళ్లు అనేకం మాట్లాడుతున్నారని తెలిపారు. తాను ఫలానా నేతలని పేర్లు చెప్పనని, తలకాయ ఉన్నోళ్లు, లేనోళ్లు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నట్టు కవిత సెటైర్లు విసిరారు.
కానీ మాటలతో పనులు కావన్నారు. మాటలతో మన ఇంటికి ఒక ముద్ద అన్నం రాదన్నారు. మాటలతో అభివృద్ధి జరగదన్నారు. అభివృద్ధి జరగాలంటే హృదయం పెట్టి పని చేయాలన్నారు. మన దగ్గర అలాంటి నాయకులు ఉన్నారని కవిత తెలిపారు. బట్టేబాజ్ మాటలు మస్తుగా మాట్లాడే వాళ్లున్నారని ప్రత్యర్థులపై ఆమె విమర్శలు గుప్పించారు.