కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందా? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా… ఒమిక్రాన్ పంజా విసురుతుందనే ఆందోళన కనిపిస్తోంది. అయినప్పటికీ జనం మాత్రం కరోనా నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ చర్యలు చేపడతారనే ప్రచారంపై సీఎం కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,347 ఒమిక్రాన్ కేసులు బయట పడ్డాయి. వీటిలో ఒక్క మన దేశంలోనే 24 ఉన్నట్టు నిర్ధారించారు. దేశం మొత్తమ్మీద చూస్తే… ఇది చిన్న సంఖ్య అయినప్పటికీ, మన వరకూ రాదులే అనుకుంటే మాత్రం మహమ్మారి దెబ్బ తీస్తుందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు.
లాక్‌డౌన్ విధేంచే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని కేజ్రీవాల్ తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు తాను సమీక్షిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు. కానీ ప్రజలకు తాను ఓ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కే మనకు శ్రీరామ రక్ష అని అన్నారు.