యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టిన నారా లోకేశ్‌ను జనం లైట్ తీసుకుంటున్నారు. లోకేశ్‌ను నాయకుడిగా గుర్తించేందుకు ప్రజలకు మనస్కరించనట్టే కనిపిస్తోంది. చంద్రబాబు సభలకు మాత్రం జనం బాగా వెళ్తున్నారు. లోకేశ్‌ను జనం పట్టించుకోలేదని అనుకునేందుకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి?
కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి బహిరంగ సభ, అలాగే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం మండ లాల్లో రోడ్‌షోల్లో చంద్రబాబు పాల్గొన్నారు. జనం భారీగా తరలి వెళ్లారు. మరోవైపు లోకేశ్ పాదయాత్రలో మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో జనం కనిపించడం లేదు. లోకేశ్ పాదయాత్రకు స్పందన అంతంత మాత్రమే ఉండడం టీడీపీకి ఆందోళన మిగిల్చినప్పటికీ, మరోవైపు బాబు సభలకి వెల్లువెత్తడం ఆనందాన్ని ఇస్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
జగన్‌కు చంద్రబాబునే ప్రత్యామ్నాయ నాయకుడిగా జనం చూస్తుండడం వల్లే ఈ తేడా కనిపిస్తోందని టీడీపీ నాయకులు అంటు న్నారు. చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తుండడంతో లోకేశ్‌ను ఇప్పటికప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదని జనం భావించి వుండొచ్చనేది టీడీపీ ఆలోచన.
లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి మైలేజ్ రాకపోయినా, కనీసం నష్టం కలగకుండా చాలని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్లడంతో లోకేశ్ పాదయాత్రకు ఎల్లో మీడియాలో కూడా ప్రాధాన్యం తగ్గింది.