నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతం చేయడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. ఇప్పటి వరకూ చెప్పుకోవాల్సి వస్తే… యువగళం అనుకున్న టీడీపీ అనుకున్న స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఏదో అలా నడుస్తోందన్న అభిప్రాయం కలిగించింది. దీంతో లోకేశ్ పాదయాత్ర టీడీపీకి రాజకీయంగా లాభం తీసుకురాకపోగా, నష్టం తప్పదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వుంది. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రపై టీడీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
లోకేశ్ పాదయాత్రకు పెద్ద ఎత్తున జన సమీకరణపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. ఈ నెల 17న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నాలుగు రోజులకు తిరుపతి, అనంతరం చంద్రగిరిలోకి లోకేశ్ ప్రవేశిస్తారు. సంబంధిత నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సమావేశమై పాదయాత్ర విజయవంతానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రతి చోట 20 వేలకు ఏ మాత్రం తగ్గకుండా జనాన్ని సమీకరించాలని టీడీపీ ఇన్చార్జ్లు పట్టుదలతో ఉన్నారు. జనం లేరనే ప్రచారం వల్ల అంతిమంగా తాము కూడా నష్టపోతామనే భయం స్థానిక నేతలను వెంటాడుతోంది. లోకేశ్ పాదయాత్రకు భారీగా జనం రావడం వల్ల అది పాజిటివ్ సంకేతాల్ని జనంలోకి తీసుకెళుతుందని టీడీపీ ఇన్చార్జ్లు భావిస్తున్నారు.
అందుకే లోకేశ్ కోసం కాకపోయినా, తమ రాజకీయ ప్రయోజనాల నిమిత్తమైనా జనాన్ని సమీకరించడం తప్పనిసరి అని వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం టీడీపీ ఇన్చార్జ్లు ఆ పనిపై నిమగ్నమయ్యారు.