ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పునకు వేళైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఆయన బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తప్పించినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, అలాగే తన వాళ్లను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జనసేనాని పవన్‌కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. వైసీపీపై ఆరోపణలు చేశారు. పార్టీ మార్పు నిర్ణయాన్ని తన వాళ్లతో చెప్పేందుకు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ కీలక సమావేశం నిర్వహించతలపెట్టారు. గుంటూరులోని తన నివాసానికి రావాలని సన్నిహితులకు ఆయన సమాచారం ఇచ్చారు.
దీంతో గురువారం 11 గంటలకు కన్నా ఇంట్లో సమావేశం జరగనుంది. ఇప్పటికే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఈ నెల 24న టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. మిత్రులు, అనుచరులకు ఆ విషయాన్ని చెప్పేందుకే ఆహ్వానించినట్టు తెలిసింది. టీడీపీలో చేరితే రాజకీయ భవిష్యత్ వుంటుందని ఆయన నమ్ముతున్నారు.
గతంలో వైసీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, రాత్రికి రాత్రే నిర్ణయానికి మార్చుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో అమిత్‌షా ఫోన్ చేసి, ఏపీ బీజేపీ చీఫ్‌గా అవకాశం కల్పిస్తామన్న హామీతో వైసీపీకి వెళ్లకుండా నిలిచిపోయారు. ఇప్పుడు టీడీపీలో చేరే విషయంలో కన్నా మనసు మారే అవకాశం ఉండకపోవచ్చు.