ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చి పడిపోతే బాగుండును అని తెలుగు నాట ఎవరైనా అనుకుంటున్నారు అంటే అది…తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక్కరు మాత్రమే. ఇదిగో ఎన్నికలు, రేపే ఎన్నికలు అని కలవరిస్తున్నది ఆయన ఒక్కరు మాత్రమే. కానీ గమ్మత్తేమిటంటే దాన్ని ఆయన వైఎస్ జగన్ మీదకు నెట్టేస్తారు.
జగన్ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారు అంటారు. జగన్ ముందస్తుకు వెళ్తే తాను రెడీ అంటారు. జగన్ ముందస్తుకు వెళ్లే దమ్ముందా అంటారు. జగన్ ముందస్తుకు వెళ్లే కుట్ర చేస్తున్నాడు అంటారు. ఇలా ముందస్తు..ముందస్తు..ముందస్తు అని ఇరవై నాలుగు గంటలు కలవరించేది మాత్రం ఒక్క చంద్రబాబు తప్ప మరెవ్వరూ కాదు. ముందస్తు ఆలోచనే లేదు మొర్రో అని జగన్ అండ్ కో పదే పదే చెప్పినా కూడా చంద్రబాబు కలవరింత మాత్రం అదే.
మెడమీద తలకాయ వున్నవాడు ఎవ్వడూ కూడా ఇప్పుడు జగన్ ముందస్తుకు వెళ్తారని అనడు. కానీ చంద్రబాబుకు ముందస్తు కావాలి. పైగా మరో ఏడాది సమయం జగన్ కు ఇస్తే ఇల్లు చక్కదిద్దేసుకుంటాడు అనే భయం. మరో ఏడాది పార్టీని కాపాడుకొవడం అంటే చిన్న విషయం కాదన్న భయం. మరో ఏడాది పాటు పార్టీ కార్యకర్తలను, నాయకులను బిగదీసి పట్టుకోవడం అంటే ఆషామాషీ కాదనే భయం. అన్నింటికి మించి రోజు రోజుకు తనకు వయసు మీద పడుతోందని, ఆరోగ్యం అనేది రేపు ఎలా వుంటుందో తెలియదు అనే భయం. అందుకే బాబు ముందస్తు కలవరింపు.
ఎక్కడ సమావేశం పెట్టినా, ఆవు వ్యాసం దగ్గరకు వెళ్లి పోయినట్లు, ముందస్తు ఎన్నికల దగ్గరకు వెళ్లిపోతారు చంద్రబాబు. ముందస్తు ఆలోచన చేస్తున్నాడు జగన్ అంటారు. ముందస్తుకు వెళ్లే దమ్ముందా అంటారు. రెండు విభిన్న స్టేట్ మెంట్ లు చంద్రబాబువే.
జగన్ ఇప్పుడు ముందస్తుకు వెళ్లకపోతే అనవసరం గా లోకేష్ పాదయాత్ర వృథా అవుతుంది. రాయలసీమ నుంచి కోస్తాకు వెళ్లేలోగానే దాని ప్రభావం అనేది వుంటే అది కాస్తా మాయం అవుతుంది. అందుకే ఈ వేడిలోనే ఎన్నికలు జరిగిపోతే బాగుండును అనే భావన. అందుకే చంద్రబాబు పదే పదే అదే కలవరిస్తూ వుంటారు. దాన్ని జగన్ మీద రుద్దడానికి చూస్తుంటారు.
కానీ చంద్రబాబుకు ఇప్పటికే తెలిసి వచ్చింది. జగన్ చిన్నింటోడు కాదని..మహా ముదురు అని. బాబు ప్రదర్శించే జమానా కాలం నాటి టక్కు టమార విద్యలకు పడిపోయే రకం కాదు జగన్. జగమొండి..మహామొండి. అందుకే చంద్రబాబు కు ముందస్తు..ముందస్తు..కలవరింతలే మిగులుతున్నాయి.