బీజేపీకి ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పారు. ఇవాళ గుంటూరులో తన నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించినట్టు సమాచారం. దీంతో ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, తన నివాసానికి రావాలంటే ముఖ్య అనుచరులకు ఆయన సమాచారం పంపారు.
కన్నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయన ఇంటికి వెళ్లారు. కన్నా మాట్లాడుతూ మోదీ నాయకత్వంతో సమస్య లేదన్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం తీరు సరిగా లేదని, పని చేయలేని పరిస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ పార్టీలో ఉండడం వల్ల తనతో పాటు నమ్ముకున్న వారికి కూడా భవిష్యత్ ఉండదని స్పష్టం చేశారని తెలిసింది.
ఈ పరిస్థితుల్లో బీజేపీకి గుడ్‌బై చెప్పి, మరో పార్టీలోకి వెళ్లడమే సరైన నిర్ణయంగా చెప్పారని ఆయన అనుచరులు మీడియాకు తెలిపారు. బీజేపీకి రాజీనామా నిర్ణయాన్ని పెద్దలకు చెబుతానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారన్నారు. దీంతో బీజేపీలో కన్నా రాజకీయ ప్రస్థానం ఇవాళ్టితో ముగిసినట్టైంది. కాసేపట్లో కన్నా మీడియాతో మాట్లాడ్తారని, వివరాలు వెల్లడిస్తారని ఆయన అనుచరులు చెప్పారు.