మహిళల భద్రత కోసం జగన్ సర్కార్ తీసుకొస్తున్న ప్రతిష్టాత్మక ఏపీ దిశా చట్టాన్ని సైరా నరసింహారెడ్డి హీరో మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 తీసుకు రావాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చట్టం వల్ల ప్రతి మహిళకు , లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు రక్షణకు భరోసా, భద్రత ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలపై నిత్యం అఘాయిత్యాలను చూస్తూ సమాజం రగిలిపోతోందని, అందువల్ల తక్షణ న్యాయం కావాలనే డిమాండ్ పెరిగిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ముందడుగు వేయడం శుభపరిణామమని వెల్లడించారు.
సత్వర న్యాయం కోసం జగన్ సర్కార్ అసెంబ్లీ వేదికగా కీలక నిర్ణయం తీసుకుని మిగిలిన రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు.సీఆర్పీసీ చట్టాన్ని సవరించడం ద్వారా నాలుగు నెలలు అంతకంటే ఎక్కువ పట్టే సమయాన్ని కేవలం మూడు వారాలకు కుదించడంతో పాటు ప్రత్యేక కోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడం ద్వారా మహిళలకు చట్టంపై నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి చట్టాన్ని తీసుకురావడాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు చిరు తెలిపారు.