సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు మరణించారు. చెన్నైలోని ఒక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో ఒకరుగా నిలిచారు మారుతి రావు.
నాటక రచయితగా, ఆకాశవాణితో గొల్లపూడి వృత్తిగత జీవితం మొదలైంది. బోలెడన్ని విజయవంతమైన నాటక రచయితగా పేరు తెచ్చుకున్నారు. అలా సినీ రంగం వైపు వచ్చారు. రచయితగా వివిధ సినిమాలకు పని చేశారు.
అలా తెర వెనుక పని చేస్తూ దర్శకుడు కోడి రామకృష్ణ ప్రోద్భలంతో గొల్లపూడి నటుడిగా అవతారం ఎత్తారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి వంటి సినిమాల్లో గొల్లపూడి చేసిన పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో దటీజ్ సుబ్బారావ్.. అంటూ గొల్లపూడి పలికిన తీరు ఆయనకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత అనేక సినిమాల్లో నెగిటివ్, కామెడీ తరహా వేషాలు వేశారు. రచనా వ్యాసంగంలోనూ కొనసాగారు. ఇటీవలి వరకూ కూడా కథలు, నవలలు రాశారు. వార్త, సాక్షి వంటి పత్రికల్లో క్రమం తప్పకుండా వ్యాసాలు కూడా రాస్తూ వచ్చారు. వీలైనంతగా సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చారు. అలా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మారుతీరావు గొల్లపూడిగా తెలుగు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండి పోతారు.