ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాల గురించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సమీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిల్లో చిత్రవిచిత్రమైన విశ్లేషణలు దొర్లుతుండటం గమనార్హం. తాము గెలిచిన చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా ప్రకటించుకున్నారని టీడీపీ కార్యకర్తల సాక్షిగా చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారు. ఇన్నాళ్లూ అవో ఎన్నికలా.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లతో గెలిచారని కూడా పచ్చబ్యాచ్, చంద్రబాబు ప్రచారం చేసింది.
అయితే ఇప్పుడు మరో వాదన.. ఏమిటంటే.. కరెంట్ ఆఫ్ చేసి ఫలితాలు మార్చేసుకున్నారట! ఈ మాటన్నది స్వయంగా చంద్రబాబు నాయుడే. కరెంట్ ఆఫ్ చేసి ఫలితాలు మార్చేయడం ఏమిటో మరి. సినిమాల్లో ఇలాంటి సీన్లుంటాయి. కరెంటు పోయి.. రాగానే.. హీరో ఏదో చేయడం లేదా, ఏదో జరిగిపోయే కామెడీ సీన్లను తెలుగు ప్రేక్షకులు బోలెడన్ని సినిమాల్లో చూసి ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాంటి సినిమా కథలే చెబుతున్నారు.
కరెంటు ఆఫ్ చేసి ఫలితాలు మార్చేశారట. రీకౌంటింగ్ తో ఫలితాలు మారిన చోట గురించి చంద్రబాబు ఈ కథ చెప్పుకొచ్చారు. ఇటీవలి స్థానిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రీకౌంటింగ్ జరిగిన స్థానాలు మహా అంటే పదో ఇరవై వార్డులో, ఎంపీటీసీ స్థానాలో ఉండవచ్చు. మొత్తం స్థానిక ఎన్నికల ప్రక్రియనంతటినీ కలిపినా.. రీ కౌంటింగ్ వరకూ వెళ్లిన స్థానాలు అత్యల్ప స్థాయిలో ఉంటాయి. పది, పన్నెండు వార్డులో డివిజన్లలో., మరో పది ఎంపీటీసీ స్థానాల్లో.. రీకౌంటింగ్ జరిగి ఉంటే జరగొచ్చు.
అలా రీకౌంటింగ్ జరిగిన చోట్ల కూడా.. 90 శాతం చోట్ల పాత ఫలితమే మళ్లీ వచ్చింది కూడా! ఒకటీ రెండు ఓట్ల మెజారిటీ దక్కిన చోట రీకౌంటింగ్ జరగడం రివాజు. బ్యాలెట్ పద్ధతి ఎన్నికలు కాబట్టి.. విజయం మీద ఆశతో అభ్యర్థులు రీ కౌంటింగ్ కోరుతూ ఉంటారు. దీనికి ఎన్నికల అధికారులు అక్కడి పరిస్థితులను బట్టి ఒప్పుకుంటారు.
ఇలాంటి సందర్భాల్లో అరుదుగా మాత్రమే ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాల్లో కూడా.. రీ కౌంటింగ్ తర్వాత ఫలితాలు మారిన వార్డులు, డివిజన్లు, ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఏ నాలుగైదో ఉండవచ్చు! అంతకు మించి సీన్ లేదు.
మరి ఇంత పెద్ద ఎన్నికల ప్రక్రియలో నాలుగైదు చోట్ల రీ కౌంటింగ్ తో ఫలితం మారితే.. అది కరెంటు ఆఫ్ చేసుకుని ఫలితం మార్చేయడమట. ఇదీ చంద్రబాబు తాజా ఉవాచ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెర్రిగొర్రెలను చేస్తూ… చంద్రబాబు ఈ మాట చెప్పినట్టుగా ఉంది తప్ప, అంతకు మించిన పస శూన్యం!