‘కమ్మ’ని అల్టిమేటం: జగన్ వైపు వెళ్తే కుల బహిష్కరణ?

వైసీపీలో ఉండే నేతల్ని కమ్మ సామాజిక వర్గం దూరం చేసుకుంటుందా..? కమ్మ సమాజం నుంచి అలాంటి వారిని వెలేస్తారా..? ముఖ్యంగా వైసీపీలో ఉంటూ చంద్రబాబుని తిడితే అది కమ్మ సమాజాన్ని తిట్టినట్టేనా..? అలాంటి వారంతా…

వైసీపీలో ఉండే నేతల్ని కమ్మ సామాజిక వర్గం దూరం చేసుకుంటుందా..? కమ్మ సమాజం నుంచి అలాంటి వారిని వెలేస్తారా..? ముఖ్యంగా వైసీపీలో ఉంటూ చంద్రబాబుని తిడితే అది కమ్మ సమాజాన్ని తిట్టినట్టేనా..? అలాంటి వారంతా కమ్మ సమాజానికి ద్రోహం చేసినట్టేనా..? ఇప్పుడీ చర్చ ఏపీలో బాగా నడుస్తోంది. ఏపీలోనే కాదు, ఈ చర్చ పక్క రాష్ట్రంలో ఉన్న అదే సామాజిక వర్గాన్ని కూడా కదిలించిందంటే ఈ డిస్కషన్ ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

సీఎం జగన్ కి నిజంగా కులపిచ్చి ఉండి ఉంటే.. కచ్చితంగా తన సామాజిక వర్గం వారికే అధిక పదవులిచ్చుకునేవారు. కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టేవారు. కానీ ఆ రెండూ జరగలేదు. ఇలాంటి సామాజిక న్యాయం చంద్రబాబుకి ఇష్టం లేదు. జగన్ అలా చేస్తే.. తన సామాజిక వర్గంలో తనని తిట్టేవాళ్లు తయారవుతారని ఆయన అంచనా వేశారు. చివరకు అదే జరిగింది.

కొడాలి నాని వీర ఉతుకుడు మనందరికీ తెలిసిందే. చివరకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వెక్కి వెక్కి ఏడవడానికి అసలు కారణం అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో పక్కాగా దీనికి కులం రంగు పులిమారు బాబు. కమ్మ కులంలో ఉండేవారంతా చంద్రబాబుని గౌరవించాల్సిందేననే ఓ అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. దానికి చంద్రబాబుకి దొరికిన పదునైన ఆయుధం ఎన్టీఆర్.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా, ఏ వృత్తిలో స్థిరపడినా, ఏ దేశంలో ఉన్నా.. వారందరికీ ఉమ్మడి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. సినీ నటుడిగానే కాదు, ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు.. ఆయన్ను దేవుడిగా మార్చాయి. సామాన్యులకే ఆయన దేవుడంటే.. మరి ఆ సామాజిక వర్గం ఆయన్ను ఇంకెంత ఆరాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అల్లుడు కాబట్టి, ఇప్పుడు టీడీపీ తన చేతిలో ఉంది కాబట్టి.. తనను కూడా అలాగే ఆరాధించాలనేది చంద్రబాబు ఎత్తుగడ.

ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్టీఆర్ పాలిట విలన్ గా మారిన చంద్రబాబు.. ఎన్టీఆర్ ని ఆరాధించేవారికి మాత్రం దేవుడిలా ఉండాలనుకోవడమే ఇక్కడ సమస్య. ఇది కొంతమందికి నచ్చలేదు. మొదట్లో ఆయనతోనే ఉన్నా.. ఆయన వ్యవహారం పూర్తిగా తెలిసి ఇప్పుడు తప్పు దిద్దుకున్నారు. అయితే ఇలాంటివారందరినీ కమ్మ సామాజిక వర్గానికి దూరం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు.

కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు చంద్రబాబు. ఆయన ప్రోద్బలంతోనే.. ఓ సామాజిక వర్గ కార్యక్రమంలో చంద్రబాబుని తిట్టినవారిని మట్టుబెట్టేందుకు 50లక్షలు రూపాయలు తనవంతు ఆర్థిక సాయం ప్రకటించారో వ్యక్తి. ఆ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆ తర్వాత వల్లభనేని వంశీ క్షమాపణ ఎపిసోడ్ కూడా వెంటనే జరిగిపోవడంతో ఇదేదో కుల బహిష్కరణకు భయపడి చేశారనే దుష్ప్రచారం కూడా మొదలైంది.

అయితే మంత్రి కొడాలి నాని మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ కి కులం లేదని, ఆయన్ను అడ్డు పెట్టుకుని కులరాజకీయాలు చేయడం సరికాదని చంద్రబాబుని పరోక్షంగా హెచ్చరించారు. తన సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని రెచ్చగొడితే.. తనను వెలేసినట్టేనా అని ప్రశ్నించారు. గుడివాడలో తాను సామాజిక వర్గ మీటింగ్ పెడితే 15వేల మంది వస్తారని చెప్పారు. అంతే కాదు.. ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి, ఆసరా.. ఇతర నవరత్నాల పథకాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు నాని.

మొత్తంగా నాని ఇలాంటి కుల బహిష్కరణలకు భయపడే ఛాన్సే లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే.. చంద్రబాబునే కులబహిష్కరణ చేయాలన్నారు. బాబు కలుపు మొక్క అని, దాన్ని ముందు పీకిపారేయాలన్నారు.

అయితే చంద్రబాబు మాత్రం తనని తిట్టేవారి విషయంలో కుల రాజకీయాలు తీసుకొచ్చేశారు. ఇప్పటివరకూ నాని తిట్లను ఎలా కాచుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. వంశీ ఎపిసోడ్ తర్వాత దాన్ని బహిష్కరణ వరకు తీసుకొచ్చి కొత్త పథకం రచించారు. తనని తిడితే కులం నుంచి వెలి వేస్తారనే స్థాయి నుంచి, జగన్ కు మద్దతు తెలిపినా కుల బహిష్కరణ తప్పదు అనే స్థాయికి తీసుకొచ్చారు.

అయితే కులం అనేది కేవలం అంతర్లీనంగా ఉండే అంశం మాత్రమే. తమ కులం వారు ఓట్లు వేస్తే చాలు గెలిచేస్తామనే పిచ్చి భ్రమల్లో ఏ నాయకుడూ ఉండకూడదు. పక్క కులాలు తనకు అవసరం లేదు అనుకోకూడదు. చంద్రబాబు చివరకు ఆ స్టేజ్ కి వచ్చేశారు. కులం గట్టున, పతనం అంచున నిలబడ్డారు.